కౌన్సిలర్లకు మంత్రి భారీ ఆఫర్.. క్యాతన్ పల్లి మున్సిపల్ కింగ్ ఎవరు ?
మంచిర్యా,ల 20 ఫిబ్రవరి (హి.స.) మంచిర్యాల జిల్లా క్యాతన్ పల్లి మున్సిపాలిటీపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని ఈ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని ఎలాగైనా హస్తగతం చేసుకోవాలని మంత్రి గడ్డం వివేక్ సవాల్గా
మంత్రి వివేక్


మంచిర్యా,ల 20 ఫిబ్రవరి (హి.స.)

మంచిర్యాల జిల్లా క్యాతన్ పల్లి మున్సిపాలిటీపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని ఈ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని ఎలాగైనా హస్తగతం చేసుకోవాలని మంత్రి గడ్డం వివేక్ సవాల్గా తీసుకున్నట్టు సమాచారం. అధికారాన్ని నిలుపుకోవడానికి అవసరమైన ఒక్కో కౌన్సిలర్కు రూ.3 కోట్ల చొప్పున ముగ్గురు కౌన్సిలర్లకు స్థానిక మంత్రి భారీ ఆఫర్ ప్రకటించినట్టు ప్రచారం నడుస్తోంది. అందుకోసం కౌన్సిలర్ల కుటుంబసభ్యులతోనూ ప్రత్యేకంగా సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తున్నది. కానీ బీఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లు అందుబాటులోకి రాకపోవడంతో ప్రయత్నాలు ఫలించడం లేదని సమాచారం. అధికార పార్టీ బేరసారాలను గమనించిన బీఆర్ఎస్.. తమ పార్టీ కౌన్సిలర్లు చేజారిపోకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నది.

్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎన్నిక సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన రాళ్ల దాడిలో ఓ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. ఇప్పుడు అసలైన రాజకీయానికి మంత్రి గడ్డం వివేక్ తెరలేపినట్టు స్థానికంగా ప్రచారం జరుగుతున్నది. ఎలాగైనా చైర్మన్ పదవిని సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఆయన చక్రం తిప్పుతున్నట్టు టాక్. అందుకోసం ముగ్గురు కౌన్సిలర్లకు రూ.3 కోట్ల చొప్పున ఆఫర్ ఇస్తున్నట్టు పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ నడుస్తున్నది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి కౌన్సిలర్ల సంఖ్యా బలం లేదు. కానీ బీఆర్ఎస్, సీపీఐకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లను లాక్కుని చైర్మన్ సీటును సొంతం చేసుకోవాలన్న ప్లాన్లో మంత్రి వివేక్ ఉన్నట్టు స్పష్టమవుతున్నది.

వివేక్.. పరువు కాపాడుకుంటారా?

మున్సిపల్ ఎన్నికల్లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సొంత నియోజకవర్గంలోని మున్సిపాలిటీలను గెలిపించుకుని సక్సెస్ అయ్యారు. కానీ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాత్రం తన నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీల్లో ఒకచోట మాత్రమే కాంగ్రెస్ను గెలిపించుకుని సక్సెస్ అయ్యారు. దీనితో మిగతా మంత్రుల ముందు ఆయన పరువుపోయే పరిస్థితి ఏర్పడింది. సొంత నియోజకవర్గంలోనే మంత్రికి పట్టులేదన్న విమర్శలు మొదలయ్యాయి. కొందరు ఇప్పటికే ఆయన్ను మంత్రివర్గం నుంచి తప్పించాలని కాంగ్రెస్ హైకమాండ్కు ఫిర్యాదులు చేసినట్టు తెలిసింది. ఈ విషయాన్ని గ్రహించిన మంత్రి క్యాతన్ పల్లి మున్సిపాలిటీని ఎలాగైనా హస్తగతం చేసుకోవాలని పెద్దఎత్తున ఆఫర్లు ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.

క్యాంపులోనే బీఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లు

కాంగ్రెస్ ఇస్తున్న ఆఫర్కు ఎక్కడ మనస్సు మార్చుకుంటారోనని అనుమానంతో బీఆర్ఎస్ తమ కౌన్సిలర్లతో పాటు సీపీఐ కౌన్సిలర్లను హైదరాబాద్ శివారులోని ఓ ఫాంహౌస్లోని క్యాంపులో ఉంచినట్టు తెలిసింది. బీఆర్ఎస్లోని కీలక నేతలు రెగ్యులర్గా వారితో టచ్ ఉన్నట్టు తెలుస్తుండగా.. క్యాంపులోని కౌన్సిలర్లతో నేరుగా సంప్రదింపులు చేసేందుకు కుదరకపోవడంతో వారి కుటుంబసభ్యులతో మంతనాలు కొనసాగిస్తున్నట్లు తెలిసింది.

ముగ్గురు జంప్తో కాంగ్రెస్ గెలుపు

ఎన్నికలకు ముందే కూటమిగా పోటీ చేయడంతో బీఆర్ఎస్ 10, సీపీఐ 4 స్థానాలు గెలుచుకున్నది. కాంగ్రెస్ 7 ఇండిపెండెంట్ ఒక్క స్థానం దక్కించుకున్నారు. కానీ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి వివేక్, ఆయన కుమారుడు, ఎంపీ వంశీకృష్ణ ఎక్స్ అఫిషియో ఓట్లతో కాంగ్రెస్ బలం 10కు చేరింది. బీఆర్ఎస్, సీపీఐ కూటమిలోని ముగ్గురు కౌన్సిలర్ల మద్దతు సంపాదిస్తే చైర్మన్ పదవి సొంతం చేసుకోవచ్చనే వ్యూహంలో మంత్రి వివేక్ ఉన్నట్టు తెలిసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande