
న్యూఢిల్లీ, 20 ఫిబ్రవరి (హి.స.)
భారత్ అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం (Interim Trade Deal) ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం వెల్లడించారు. ప్రస్తుతం ఈ చర్చలు తుదిదశలో ఉన్నట్లు తెలిపారు. ఒప్పందానికి సంబంధించి న్యాయపరమైన అంశాలపై చర్చించి, ఖరారు చేసేందుకు భారత్- అమెరికా అధికారులు ఫిబ్రవరి 23న అమెరికాలో భేటీ కానున్నారు. ఈ సమావేశం సుమారు మూడ్రోజులు కొనసాగుతుందని సమాచారం.
అమెరికాతో పాటు.. బ్రిటన్, ఒమన్ దేశాలతో కూడా భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కూడా ఏప్రిల్ నెల నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. అదేవిధంగా న్యూజిలాండ్ దేశంతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి కార్యరూపం దాల్చనుందని పేర్కొన్నారు. భారత్ - అమెరికా ట్రేడ్ డీల్ అమల్లోకి వస్తే.. భారత్ ఎగుమతులపై సుంకాలు 18 శాతానికి తగ్గనున్నాయి. ఈ ఒప్పందాల ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో భారత ఎగుమతులు పెరగడమే కాకుండా.. విదేశీ పెట్టుబడులు సైతం వచ్చే పెరిగే చాన్స్ ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు