
తిరుమల, 20 ఫిబ్రవరి (హి.స.)
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోగా.. శుక్రవారం ఉదయానికి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకూ భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ప్రస్తుతం కంపార్టుమెంట్లు, క్యూలైన్లలో టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుండగా.. టోకెన్లు ఉన్న భక్తులకు 3-5 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2-3 గంటల సమయం పడుతుందని పేర్కొంది. కొత్తగా టోకెన్లు లేకుండా క్యూలైన్లోకి వెళ్లే భక్తులకు 12 గంటల సమయం పడుతుంది. నిన్న (గురువారం) 57,682 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. 27,020 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.3.65 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.
కాగా.. తిరుమలలో నటి త్రిష సందడి చేసింది. గురువారం సాయంత్రం శ్రీవారి నైవేద్య విరామ సమయంలో శ్రీవాణి వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్ మీదుగా శ్రీవారి ఆలయ మహాద్వారానికి చేరుకున్న త్రిషకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV