
అమరావతి, 20 ఫిబ్రవరి (హి.స.)ఏపీ శాసనమండలిని ఇందాపూర్ డెయిరీ నెయ్యి సరఫరా అంశం కుదిపేసింది. ఉదయం మండలికి వైసీపీ ఎమ్మెల్సీలు ప్లకార్డులు చేతపట్టి ర్యాలీగా వెళ్లారు. మళ్లీ ఇందాపూర్ డెయిరీ, టీటీడీలో హెరిటేజ్ దోపిడీపై చర్చించాలంటూ తీర్మానం ఇవ్వగా.. దానిని చైర్మన్ మోషేను రాజు తిరస్కరించారు. కాగా.. సభలోకి వైసీపీ ఎమ్మెల్సీలు దేవుడి ఫొటోలు తీసుకునిరావడం తీవ్ర దుమారానికి దారితీసింది. దీనిపై మంత్రి పయ్యావుల కేశవ్ ఘాటుగా స్పందించారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగుతారా అంటూ ఫైరయ్యారు. దేవుడి ఫొటోలను పట్టుకుని సభలోకి రావడం అంటే.. దేవుడిని రాజకీయాల్లోకి లాగడమేనన్నారు. ఈ దుర్మార్గాన్ని అనుమతించవద్దని డిమాండ్ చేశారు.
మండలిలో ప్రతిపక్షనేతలకు దేవుడంటే నమ్మకం, భయం, గౌరవం లేవని ధ్వజమెత్తారు. వాళ్ల నాయకుడు ఎలా చెప్తే అలా నడుచుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి పయ్యావుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి ఫొటోలను సభలోకి తీసుకురావడం హిందూ ధర్మాన్ని, నమ్మకాన్ని దెబ్బతీయడమేనని ఆరోపించారు. వైసీపీ ఇలాంటి పనులు చేసి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని, ఇలాంటి చర్యలను అనుమతించవద్దని చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు. ఆయన గొంతు చించుకుని అరుస్తున్నా.. వైసీపీ నేతలు దేవుడి ఫొటోలు పట్టుకునే ఆందోళన చేయడంతో.. అసహనంతో హెడ్ ఫోన్స్ తీసి విసిరిగొట్టారు. ఆందోళనల మధ్యే చైర్మన్ మండలిని వాయిదా వేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV