
విశాఖపట్నం, 21 ఫిబ్రవరి (హి.స.), ‘దేశంలో కొత్తగా ఏర్పాటవుతున్న డేటా సెంటర్లతో ఆర్థిక పురోగతి ఎలా ఉంటుంది? ఎంతవరకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి? అనే అంశాలపై త్వరలో ఆర్థిక సర్వే నిర్వహించనున్నాం’ అని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) జాతీయ అధ్యక్షుడు డి.ప్రసన్నకుమార్ తెలిపారు. విశాఖపట్నానికి చెందిన ఆయన 2026-27 సంవత్సరానికి జాతీయ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనను వాల్తేరు క్లబ్లో శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ప్రభుత్వం ఏ కొత్త చట్టాలు చేసినా, వాటిని సరళీకృతం చేసి ప్రజలకు చేరువగా తీసుకువెళ్లేది సీఏలే. కృత్రిమ మేధ అన్ని రంగాలను ప్రభావితం చేస్తున్న మాట వాస్తవమే అయినా అకౌంటెంట్లకు నష్టం లేదు. అయితే ఆధునిక సాంకేతికతను ప్రతి రంగంలోను ఉపయోగించుకోక తప్పదు.
మేం ఇప్పటికే ఏఐ టూల్స్ వినియోగిస్తున్నాం. రాష్ట్రంలో ఎక్స్లెన్స్ సెంటర్ ఏర్పాటు చేయాల్సి ఉంది. అది ప్రభుత్వ పాలసీపై ఆధారపడి ఉంటుంది. సీఏ చేస్తే ఉపాధికి ఢోకా లేదు. త్వరలో యువతకు ఆర్థిక క్రమశిక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం’ అని ప్రసన్నకుమార్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ