
హైదరాబాద్, 21 ఫిబ్రవరి (హి.స.)
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ 2.05 భాగంగా రాష్ట్రంలో ప్రతి మున్సిపాలిటీకి జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) ఆధారిత మాస్టర్ ప్లాన్స్ రూపొందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే మార్చి నాటికి 19 పట్టణాలకు ఈ ప్లాన్లను సిద్ధం చేయాలని డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) విభాగం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటికే వీటికి సంబంధించి అన్ని రకాల సర్వేలు పూర్తి చేశారు. వీటితోపాటు రాష్ట్రంలోని మరో 50 పట్టణాలకు మాస్టర్ ప్లాన్లను రూపొందించేందుకు డీటీసీపీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రభుత్వం అనుమతి రాగానే సర్వే ప్రక్రియను ప్రారంభించే అవకాశముంది.
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మాస్టర్ ప్లాన్ ఎందుకు అనే సందేహం ప్రజల్లో వ్యక్తమవుతుంటుంది. గతంలో కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదాస్పదమై.. ఆ తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. గ్రామాలు, పట్టణాల్లో గతంలో ఇష్టమొచ్చినట్టు నిర్మాణాలు చేపట్టేవారు. దీంతో రోడ్లు, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారాయి. ఈ పరిస్థితిని చక్కదిద్ది, భవిష్యత్ తరాలకు అత్యుత్తమ సదుపాయాలు అందించే ఉద్దేశంతో పట్టణాలకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ప్రతి టౌన్కు సంబంధించి ఉపరితలం ఎత్తు, కుంటలు, చెరువులు, విస్తీర్ణం, మార్కెట్ యార్డులు, సెల్ టవర్లు, డ్రైనేజీలు, రోడ్లు, ప్రధానమైన పంటలు, తాగునీటి సరఫరా, మరుగుదొడ్లు, సర్వే నంబర్ల వారీగా ప్లాన్, కోల్డ్ స్టోరేజీలు, మార్కెట్ల వారీగా రవాణా సదుపాయాలు, వ్యవసాయ భూమి, ఇళ్లు, చెట్లు, వాటర్ ట్యాంకులు, రైల్వే, బస్ స్టేషన్లు, సాగు, తాగునీటి వనరులను డ్రోన్ సర్వే ద్వారా మ్యాపింగ్ చేస్తున్నారు. మ్యాపింగ్ను, శాటిలైట్ ఇమేజ్ల ఆధారంగా భవిష్యత్ తరాల అవసరాలకు తగ్గట్టుగా తయారు చేయబోయే మాస్టర్ ప్లాన్కు ఈ డిజిటల్ సర్వే ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే పలు పట్టణాలు, నగరాలకు మాస్టర్ ప్లాన్లు..
రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఇప్పటికే మాస్టర్ ప్లాన్స్ తయారు చేయగా ఆమోదం పొందాయి. గ్రేటర్ వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి పట్టణాల మాస్టర్ ప్లాన్లను ప్రభుత్వం ఆమోదించింది. భూపాలపల్లి, దేవరకొండ, అచ్చంపేట, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, ఆందోల్, జోగిపేట్ ముసాయిదా మాస్టర్ ప్లాన్లను ప్రభుత్వ ఆమోదించాల్సి ఉన్నది. ఈ నగరాల్లో ఎక్కడెక్కడ రెసిడెన్షియల్ ఏరియాలు, కమర్షియల్ ప్రాంతాలు, చెరువులు, ఖాళీ స్థలాలతో పాటు అగ్రికల్చర్ ల్యాండ్స్ లాంటి పలు అంశాలను డిజిటల్ సర్వేలో గుర్తించారు.
కేంద్ర ప్రభుత్వ అమృత్ 2.0లో మరో 19 పట్టణాలు, నగరాలకు మాస్టర్ ప్లాన్ల పనులు పురోగతిలో ఉన్నాయి. డ్రోన్ సర్వే పూర్తి చేశారు. దీంతో పాటు సోషియో ఎకానమిక్ సర్వే కూడా పూర్తిచేసినట్టు అధికారులు తెలిపారు. వీటిలో 10 చోట్ల మాత్రమే ఫీల్డ్ సర్వే పూర్తయింది. మరో 10 చోట్ల సర్వే పురోగతిలో ఉంది. ఈ 19 ప్రాంతాలకు జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జీఐఎస్) ఆధారిత మాస్టర్ ప్లాన్లను ఈ ఏడాది మార్చి వరకు పూర్తి చేయడానికి డీటీసీపీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
మరో 50 పట్టణాలకు..
రాష్ట్రంలో 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలను మినహాయిస్తే 130 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. వీటిల్లో 15 పట్టణాలకు మాస్టర్ ప్లాన్లను పూర్తిచేశారు. మరో 19 పట్టణాలకు మాస్టర్ ప్లాన్ పనులు మార్చి వరకు పూర్తవుతాయి. వీటితో పాటు కొత్తగా 50 పట్టణాలకు మాస్టర్ ప్లాన్లు రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు కూడా ఉన్నాయి. వీటికి సంబంధించిన ప్రతిపాదనలను డీటీసీపీ సిద్ధం చేసింది. ప్రభుత్వం నుంచి అనుమతిరాగానే మాస్టర్ ప్లాన్ రూపకల్పన ప్రక్రియను ప్రారంభించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. మిగిలిన వాటికి దశలవారీగా మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నట్టు అధికారులు చెబుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..