
హనుమకొండ, 21 ఫిబ్రవరి (హి.స.)
గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో హనుమకొండ జిల్లా ముల్కనూర్ మోడల్ స్కూల్లో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిర కార్యక్రమాన్ని , హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రారంభించారు. కాగా ఈ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. తెలంగాణ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో భీమదేవరపల్లి మండలంలోని పలు గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణులకు నగరాల మాదిరిగానే వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, జీవనశైలి మార్పులతో అనేక వ్యాధులను నివారించవచ్చని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు