
నల్గొండ, 21 ఫిబ్రవరి (హి.స.)
చట్టాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని నల్గొండ జిల్లా జడ్జి మంజుల సూర్యావర్ అన్నారు. శనివారం జిల్లాలోని కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో మండల న్యాయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన చట్టాలపై అవగాహన- న్యాయ సాక్షరత కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. సమాజంలో ప్రతి పౌరుడికి సమాన న్యాయం అందడం రాజ్యాంగ హామీ అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించడమే న్యాయ సేవా సంస్థ ప్రధాన ఉద్దేశం అని తెలిపారు. కోర్టు వివాదాల పరిష్కారంలో న్యాయవాదిని అందించి న్యాయపరమైన సహాయం చేస్తున్నట్లు చెప్పారు. మైనర్ బాలురు వాహనాలు నడపడం చట్ట విరుద్ధమని, అందరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి సమయపాలనతో కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలన్నారు. మాతృ భాష మన ఆత్మగౌరవానికి ప్రతీక అని మాతృభాషను మరువకూడదన్నారు. విద్యార్థులకు కవిత, పద్య పోటీలు నిర్వహించి ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..