
నిజామాబాద్, 21 ఫిబ్రవరి (హి.స.)
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించడంతో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మహిళలే మున్సిపల్ పగ్గాలను చేజిక్కించుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఎల్లారెడ్డి మున్సిపాలిటీ మినహా నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ సహా ఆర్మూర్, బోధన్, భీమ్గల్, కామారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీలలో మహిళలే చైర్ పర్సన్లుగా కొలువుదీరారు. శుక్రవారం పదవీ బాధ్యతలు కూడా స్వీకరించారు. మేయర్ గా, చైర్ పర్సన్లుగా కొలువుదీరిన మహిళల్లో దాదాపు అందరూ సాధారణ గృహిణులే కావడం విశేషం. భర్తలు రాజకీయాల్లో ఉన్నప్పటికీ మహిళలు ఎప్పుడు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన వారు తక్కువే.
రిజర్వేషన్ల పుణ్యమాని ఏకంగా మేయర్, చైర్ పర్సన్ల పీఠం పైనే కొలువుదీరాల్సిన అవకాశం దక్కింది. ఇంత వరకు బాగానే ఉంది. ఇక రేపటి నుంచి తమ కార్పొరేషన్ పరిధిలో, తమ తమ మున్సిపాలిటీల పరిధిలో అభివృద్ధి పనులపై ఫోకస్ చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇన్నాళ్లూ ఇంటి బాగోగులు, పిల్లల ఆలనా పాలనా చూసే బాధ్యతల నుంచి ఏకంగా ప్రజల బాగోగులు పట్టణ, నగర బాగోగులు చూసే బాధ్యతను భుజాలపై మోయాల్సి వచ్చింది. ఈ బాధ్యతలు కొంత కొత్తగా భయం భయంగా అనిపించినా తోడుగా తమ తమ భర్తలున్నారనే ధైర్యంతో ముందడుగేసే ఆలోచనలో ఉన్నారు మహిళా ప్రజాప్రతినిధులు.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సహా ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ప్రజలను వేధిస్తున్న సమస్యలు, ప్రజా ప్రతినిధులకు ప్రజల్లో ఇబ్బందికర పరిస్థితులను సృష్టించే సమస్యలు ముఖ్యంగా ఇవే కావడంతో వాటిపైనే ముందుగా దృష్టి పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పైగా అన్ని చోట్లా కాంగ్రెస్ పార్టీ కి చెందిన వారే అధికార పీఠంలో కొలువు దీరడంతో రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధుల ప్రవాహానికి ఏం కొదవ ఉండదనే ధైర్యం ప్రజాప్రతినిధుల్లో కనిపిస్తోంది. దీనికి తోడు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సహా రాష్ట్ర మంత్రులు కూడా మున్సిపాలిటీలకు, కార్పొరేషన్ కు అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తామని, నిధుల కొరత లేకుండా, అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించేందుకు సహకరిస్తామని చెప్పడం కొత్తగా బాధ్యతలు చేపట్టిన మేయర్, వైస్ చైర్ పర్సన్లకు ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు.
నాలాల ఆక్రమణల సమస్య పరిష్కారమయ్యేనా?
నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో ప్రధాన ప్రాంతాల్లో నాలాలు కబ్జాకు గురయ్యాయి. నాలాల పైనే పక్కా నిర్మాణాలు చేయడంతో నాలాలు కనుమరుగైపోయాయి. దీంతో నాలాల్లో ప్రవహించాల్సిన మురుగు నీరు రోడ్ల పైకి చేరి పలు ప్రాంతాల్లో దుర్గంధం వెదజల్లుతోంది. ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురై రోగాల పాలవుతున్నారు. వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసినప్పుడు నగరంలోని నాలాల్లో పారాల్సిన నీరు నాలాలపైకి చేరి రోడ్లన్నీ జలమయమవుతాయి. గత రెండు, మూడు సీజన్లలో వరుసగా నాలాల్లో చిన్నారులు గల్లంతైన విషాధకర ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటన్నింటికి కారణం నాలాల ఆక్రమణే అన్న సంగతి నగరంలోని ప్రతి ఒక్కరికీ తెలుసు. ప్రజాప్రతినిధులకైతే ఈ విషయం బాగా తెలుసు. కానీ, రాజకీయ లబ్ధి కోసం నాలాల ఆక్రమణపై కొరడా జులిపించడం లేదు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు