
సూర్యాపేట, 21 ఫిబ్రవరి (హి.స.)
సూర్యాపేట మున్సిపాలిటీ ఎన్నికల
ఫలితాల అనంతరం ఓటమి చెందిన అభ్యర్థుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. గెలిస్తే రాజకీయ భవిష్యత్తు బాగుంటుందన్న ఆశతో పోటీ చేసిన అభ్యర్థులకు ఇప్పుడు అప్పుల భారం పెనుభారంగా మారింది. ఎన్నికలవేళ గెలుపుపై ధీమాతో ప్రత్యర్థులకు పోటాపోటీగా ఒక్కో అభ్యర్థి రూ.30 లక్షల నుంచి ఏకంగా రూ.2కోట్ల వరకు వెచ్చించినట్లు తెలుస్తోంది. తీరా ఓటమి చవిచూశాక, చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక అభ్యర్థులు మనోవేదనకు గురవుతున్నారు. కనీసం సొంత పార్టీ ముఖ్య నేతలు కూడా తమను పలకరించకపోవడంతో ఒంటరైపోయిన అభ్యర్థులు లోలోపల కుమిలిపోతున్నారు.
ఆస్తులు అమ్మి.. అప్పులు తెచ్చి..
రాజకీయ ఎదుగుదలకు కౌన్సిలర్ పదవి తొలిమెట్టు అని భావించిన కార్యకర్తలు, రిజర్వేషన్లు కలిసి రావడంతో ఉత్సాహంగా బరిలోకి దిగారు. ఓటర్లను ఆకర్షించేందుకు విందులు, వినోదాలు, ఖరీదైన బహుమతులతోపాటు ఓటుకు రూ.1,000 నుంచి రూ.10వేల వరకు పంపిణీ చేశారు. ఇందుకోసం కొందరు తమకున్న స్థిరాస్తులు విక్రయించగా, మరికొందరు వ్యవసాయ భూములను తాకట్టు పెట్టి లక్షలాది రూపాయలు తెచ్చి ఖర్చు చేశారు. నామినేషన్ వేసిన నాటి నుంచి ఫలితాల వరకు చేసిన ఖర్చు ఇప్పుడు వారిని అప్పుల ఊబిలోకి నెట్టింది. ఎన్నికల సమయంలో వెనకడుగు వేయకుండా తెచ్చిన అప్పులకు నెలనెలా వడ్డీలు కట్టడం ఇప్పుడు పెను సవాలుగా మారింది.
నిలువునా ముంచిన సన్నిహితుల ఒత్తిడి..
నిజానికి కొంతమందికి పోటీ చేసే ఆసక్తి లేకున్నా, పార్టీలు, సన్నిహితుల ఒత్తిడి మేరకు చివరి నిమిషంలో రంగంలోకి దిగారు. తీరా ఫలితాలు తారుమారు కావడంతో అటు గెలవలేక, ఇటు అప్పులు కట్టలేక వారి పరిస్థితి 'రెంటికి చెడ్డ రేవడి'లా మారింది. పేదోడు రాజకీయాల్లో ఉండడం కష్టమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాటలు ఇప్పుడు అక్షర సత్యమవుతున్నాయి. అప్పుల బాధ నుంచి ఎలా గట్టెక్కాలో తెలియక, ఆదుకునే వారు లేక ఉమ్మడి జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో ఓటమి చెందిన అభ్యర్థులు దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు