షబ్బీర్ అలీ, రమణారెడ్డి మధ్య సవాళ్లు.. కామారెడ్డిలో ఉద్రిక్తత
బీజేపీ, కాంగ్రెస్ నేతల బహిరంగ చర్చ నేపథ్యంలో కామారెడ్డిలో ఉద్రిక్త వాతావరణం
Kamareddy


హైదరాబాద్, 21 ఫిబ్రవరి (హి.స.)జిల్లా కేంద్రంలో హైటెన్షన్ నెలకొంది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఉద్రిక్తత నెలకొంది. శిశుమందిర్ పాఠశాల వద్దకు కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేరుకోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల విషయంలో ఇరుపార్టీల నాయకులు ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ కళాశాల భూములు, శిశుమందిర్ పాఠశాల, అరోరా కాలేజ్ విషయంలో కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలపై తాను చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే రమణారెడ్డి తెలిపారు. కామారెడ్డి ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉందని, సాక్ష్యాధారాలతో చర్చకు రావాలని ఎమ్మెల్యే సవాల్ విసిరారు.

శిశుమందిర్ వేదికపై బహిరంగ చర్చకు రెండు పార్టీలు సిద్ధమయ్యాయి. ఇరు పార్టీల నేతల సవాళ్లతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి క్యాంప్ ఆఫీసు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే ఎమ్మెల్యేను హౌజ్ అరెస్ట్ చేశారు. క్యాంప్ ఆఫీస్ నుంచి ఎమ్మెల్యే బయటకు రాకుండా నిర్బంధంలో ఉంచారు. ఉద్రిక్తతల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రమణారెడ్డి ప్రకటన విడుదల చేశారు. ఎవరూ కూడా శిశుమందిర్ వద్దకు రావొద్దని తెలిపారు. ఇది తన కుటుంబంపై చేసిన ఆరోపణ అని, తానే నిరూపించుకుంటానని ఆయన అన్నారు.

మరోవైపు ఎమ్మెల్యే రమణారెడ్డి చేసిన సవాల్ను కాంగ్రెస్ నేతలు స్వీకరించారు. తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, ఆయన అవినీతిని నిరూపిస్తామంటూ పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు రమణారెడ్డి ఇంటి వద్దకు, వేదికగా నిర్ణయించిన శిశుమందిర్ వద్దకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వచ్చిన వారిని వచ్చినట్టే పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలిస్తున్నారు. ఇప్పటివరకూ శిశుమందిర్ వద్దకు వచ్చిన సుమారు వందమంది కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. వివిధ మార్గాల్లో శిశుమందిర్ వద్దకు రావడానికి ప్రయత్నిస్తుండటంతో నలువైపులా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. అయినప్పటికీ, కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు రమణారెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకుని, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పలువురు బీజేపీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని కాంగ్రెస్ నేతల కారుపై దాడి చేశారు. అద్దాలను ధ్వంసం చేసి పల్టీలు కొట్టించారు. ఇరు పార్టీల నేతలను చెదరగొట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande