

ఢిల్లీ, 21 ఫిబ్రవరి (హి.స.)దేశరాజధాని ఢిల్లీలో ఇంటిలిజెన్స్ అలర్ట్ ప్రకటించింది. ఎర్రకోట వద్ద బాంబు పేలుళ్లకు ఎల్ఈటీ ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు తెలిపింది. పాకిస్థాన్ మసీద్ వద్ద ఇటీవల జరిగిన పేలుళ్లకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఉగ్రవాదులు ప్రయత్నం చేస్తున్నారని నిఘావర్గాలు చెబుతున్నాయి. దేవాలయాల వద్ద పేలుళ్లకు కుట్ర చేస్తున్నారని హెచ్చరిస్తున్నాయి. ఇదిలా ఉంటే గురువారం పలు రాష్ట్రాల్లోని కోర్టులు, స్కూళ్లను లక్ష్యంగా చేసుకుని బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
దీంతో భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. బంగ్లాదేశ్ సర్వర్ల నుండి నకిలీ బెదిరింపు ఈమెయిల్స్ వచ్చినట్టు గుర్తించారు. ఈ క్రమంలో ఢిల్లీలోని మూడు సీఆర్పీఎఫ్ పాఠశాలలకు సైతం బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఉదయమే మెయిల్స్ రావడంతో విద్యార్థులను ఇంటికి పంపించి తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ సోదాలలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కానీ పేలుడు పదార్థాలు కానీ దొరకలేదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV