
తిరుమల, 21 ఫిబ్రవరి (హి.స.)కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పండితులు ఆయనకు ఆశీర్వచనం చేసి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం ఆలయ వెలుపల ఆయన మాట్లాడుతూ.. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ ను పరిశీలించినట్లు తెలిపారు. విమానయాన శాఖలో కూడా ఈ కేంద్రాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. టీటీడీ తమకు ఉపయోగపడేలా ఏఐని తీర్చిదిద్దిందని అభినందించారు. ఇలాంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కేంద్రాన్ని స్థాపించాలంటే చాలాకాలం పడుతుందని ఆయన వెల్లడించారు.
కాగా.. తిరుమలలో శనివారం భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోగా.. శిలాతోరణం వరకూ క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేనివారికి స్వామివారి దర్శనానికి 18-20 గంటలు పడుతుండగా.. సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు దర్శనానికి 4-6 గంటలు, రూ.300 స్పెషల్ ఎంట్రీ దర్శనానికి 3-4 గంటల సమయం పడుతుందని టీటీడీ పేర్కొంది. భక్తుల రద్దీని బట్టి దర్శన వేళలు మారే అవకాశం ఉంది. నిన్న (శుక్రవారం) శ్రీవారిని 68,156 మంది భక్తులు దర్శించుకోగా.. 28,295 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.46 కోట్లు సమకూరింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV