
అమరావతి, 22 ఫిబ్రవరి (హి.స.): పర్యాటకులకు అరుదైన ఆతిథ్యాన్ని ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) అందిస్తోంది. పచ్చని కొండలపై ప్రకృతి అందాల నడుమ సందర్శకులను ఆకట్టుకునేలా ‘టెంట్ సిటీ’లు నిర్మిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా టైడా, లంబసింగిలో ఈ ప్రాజెక్టులు చేపట్టారు. టైడాలో నిర్మాణాలు ఇప్పటికే పూర్తవ్వగా అందుబాటులోకి తీసుకొచ్చారు.
:కొరియా నుంచి దిగుమతి చేసిన ఫ్యాబ్రిక్తో ప్రత్యేకంగా టెంట్లు నిర్మిస్తున్నారు. ఒక్కో టెంట్ సైడ్ వాల్స్ ఏడు అడుగులుంటున్నాయి. మధ్యలో 12 అడుగుల ఖాళీ ప్రదేశం ఉంటుంది. వేడి, చల్లదనాన్ని నియంత్రించేలా మూడు, నాలుగు పొరలతో ఆకట్టుకునేలా నిర్మిస్తున్నారు. కొన్ని టెంట్లను త్రిభుజాకారం, మరికొన్నింటిని ఇగ్లూ నమూనాల్లో నిర్మిస్తున్నారు. లోపల అన్ని రకాల వసతులు కల్పిస్తున్నారు. ప్రత్యేక పడక గది, పందిరి మంచం, ఆరుబయట కుర్చీలు, విద్యుత్తు అలంకరణలు, టీవీ సౌకర్యం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పచ్చదనం మధ్యలో బయట వాతావరణం కనిపించేలా గ్లాసులతో టెంట్లు నిర్మించడం వీటి ప్రత్యేకత. వెన్నెల రోజుల్లో మరింత మనోహరంగా ఉంటుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ