
నరసరావుపేట, 22 ఫిబ్రవరి (హి.స.) రాయలసీమ హార్టీకల్చర్ హబ్లోకి వినుకొండను చేరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. వినుకొండలో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 12.45 గంటలకు వినుకొండ జూనియర్ కళాశాలలోని హెలిప్యాడ్కు సీఎం చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నరసరావుపేట రోడ్డులోని ఎన్నెస్పీ మైదానంలో ఏర్పాటుచేసిన సభావేదికకు వచ్చారు.
ముందుగా స్వచ్ఛ రథాల్ని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వరి పొట్టు, మొక్కజొన్న వ్యర్థాలతో తయారు చేసిన ప్లేట్లు, అలంకరణ వస్తువుల్ని చూసి వాటిని తయారు చేసిన వారిని మెచ్చుకున్నారు. ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్ను సందర్శించారు. బొల్లాపల్లి బొప్పాయి, మిర్చి, ఆయిల్పామ్ గెలలు.., వాటి నుంచి తయారు చేసే ఉత్పత్తులను జిల్లా ఉద్యాన శాఖ అధికారి వెంకట్రావు సీఎంకు వివరించారు. అనంతరం ప్రజావేదికకు చేరుకున్నారు. జిల్లాలో స్వచ్ఛతకు కృషి చేస్తున్న సేవకుల్ని సన్మానించారు. స్వచ్ఛ ప్రతిజ్ఞ అనంతరం కలెక్టర్ కృతికా శుక్లా, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ