
హైదరాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన భారతదేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి హనుమంతరావు(V.Hanumantha Rao) అన్నారు. ఇవాళ గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) ఆలోచనలను తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలు కోసం తాము శక్తిమేర అన్ని విధాలా కృషి చేశామని, కులగణన ద్వారా వెనుకబడిన వర్గాలకు మరింత న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక ఇటీవల రాజధాని ఢిల్లీలో జరిగిన 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026' నిర్వహణ తీరుపై వి.హనుమంత రావు అసహనం వ్యక్తం చేశారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సులో ప్రతిపక్ష నేతలకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని, ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. బీజేపీ అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను ప్రజలు గమనిస్తున్నారని, సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణే కాంగ్రెస్ లక్ష్యమని వీహెచ్ స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు