నెరవేరని సొంత ఇంటి కల.. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా డబుల్ బెడ్రూం ఇండ్లు
నిజామాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.) దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుపడినట్లు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించినప్పటికీ అధికారులు, పాలకుల నిర్లక్ష్యం వలన పేద ప్రజల డబుల్ బెడ్రూం ఇండ్ల కల కలగానే మిగిలిపోతుంది. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం చే
డబల్ బెడ్ రూమ్


నిజామాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.)

దేవుడు వరమిచ్చినా పూజారి

అడ్డుపడినట్లు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించినప్పటికీ అధికారులు, పాలకుల నిర్లక్ష్యం వలన పేద ప్రజల డబుల్ బెడ్రూం ఇండ్ల కల కలగానే మిగిలిపోతుంది. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం చేపట్టిన ఇండ్లు శిథిలావస్థకు చేరుకొని అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. ఇండ్ల నిర్మాణం పూర్తి కావడంతో పంపిణీ చేస్తారని ఆశగా ఎదురుచూస్తున్న పేద ప్రజలకు నిరాశే మిగులుతుంది. కొంతమంది లబ్ధిదారులమనుకున్న వారు కూడా సొంత డబ్బులతో ఇండ్ల నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిర్మాణం పూర్తయిన కూడా పంపిణీ చేయడంలో అధికారుల నిర్లక్ష్యంపై గ్రామ ప్రజలతో పాటు మండల స్థాయిలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ గదుల్లో మందుబాబులు విచ్చలవిడిగా మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.

డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణ పరిసర ప్రాంతాలతోపాటు నిర్మాణంలో ఉన్న ఇండ్లను అడ్డాగా చేసుకుని మద్యం సేవిస్తున్నారు. శిథిలావస్థకు చేరుకున్న ఇండ్లు సుమారు నాలుగు సంవత్సరాల క్రితం పూర్తయిన డబల్ బెడ్రూమ్ ఇండ్లను ఇప్పటివరకు కూడా పంపిణీ చేయకపోవడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. భారీగా కంప చెట్లు మొలవడంతో అధ్వానంగా మారాయి. కిటికీలు, తలుపులు విరిగిపోవడంతో పాటు పలుచోట్ల గోడలు కూడా కూలిపోయాయి. శిథిలావస్థకు చేరిన ఇండ్లను పంపిణీ చేసిన ఎలా నివాసం ఉండాలో అర్థం కావడం లేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యువత డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆసరాగా చేసుకుని చెడు వ్యసనాలకు అలవాటు పడి వ్యసనపరులుగా మారుతున్నారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు.

డబల్ బెడ్రూంలో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించి అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేస్తే డబుల్ బెడ్ రూములలో జరుగుతున్న సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయొచ్చు. దీనివల్ల ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వం పంపిణీ చేస్తుంది అనుకున్న డబుల్ బెడ్రూంల కోసం ఆశగా ఎదురు చూస్తున్న నిరుపేదలు సంతోషం వ్యక్తం చేసి వారి కుటుంబాలతో ఆ గృహాల్లో నివాసాలు ఉండనున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు అడ్డాగా మారిన డబుల్ బెడ్రూంలపై దృష్టి సారించి వాటిని పూర్తిస్థాయిలో నిర్మాణం చేసి సౌకర్యాలు కల్పించి అర్హులైన నిరుపేద ప్రజలకు పంపిణీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande