
వరంగల్, 22 ఫిబ్రవరి (హి.స.)
గ్రేటర్ వరంగల్ నగర కార్పొరేషన్ లో ఎన్నికల ముందే రాజకీయం వేడెక్కుతుంది. అభివృద్ధి పనుల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. అభివృద్ధి తామే చేశామని ప్రకటించుకుంటున్నారు. పాలకవర్గం పదవీకాలం ఇంకా రెండున్నర నెలలే ఉండటంతో ఇప్పటి నుంచే రెండు పార్టీల నేతలు పోటీకి సన్నద్ధమవుతున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు బహిరంగ చర్చలకు పిలుపునిస్తూ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
వరంగల్ కార్పొరేషన్ సభ్యుల పదవీకాలం మే నెల మొదటి వారంతో పూర్తవుతుంది. ఆ తర్వాత గ్రేటర్ వరంగల్ ఎన్నికలను నిర్వహించనున్నారు. పాలక మండలి సభ్యుల పదవీకాలం పూర్తయిన వెంటనే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండటంతో ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్లు మిగిలిన పనులను పూర్తి చేస్తున్నారు. కొత్త పనులకు అనుమతులు తెచ్చుకుంటూ శంకుస్థాపనలు చేస్తున్నారు. డివిజన్ల వారిగా పర్యటిస్తూ పనులను చేపడుతున్నారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పనులను ప్రారంభిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా గడువు ఉన్నా ముందస్తుగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల కోసం సన్నద్ధమవుతున్నారు.
పలు కాలనీలు తిరుగుతూ..
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో రెండు దఫాలు బీఆర్ఎస్ ప్రాతినిధ్యం దక్కించుకుంది. వారి హయాంలోను అభివృద్ధి పనులను చేపట్టారు. రెండేళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనులు నిర్వహిస్తున్నారు. సుమారు నాలుగువేల కోట్ల రూపాయల పనులకు అనుమతులు తెచ్చుకున్నారు.
డివిజన్ల వారిగా ప్రజల బాట పేరున పర్యటిస్తూ పనులను ప్రారంభించడంతో పాటు క్యాడర్ ను సమాయత్తం చేస్తున్నారు. ప్రజలను కలుస్తూ సమస్యలను తెలుసుకొని పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో చేపడుతున్నారు. వరంగల్ పశ్చిమ్మ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్ బాట కార్యక్రమం చేపట్టి పనులు నిర్వహిస్తున్నారు.
వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, పరకాల నియోజకవర్గం పరిధిలో రేవూరి ప్రకాష్ రెడ్డి పనులను చేస్తున్నారు. మేయర్ ఆధ్వర్యంలో మేయర్ గుండూ సుధారాణి నేతృత్వంలో పలు కాలనీలు తిరుగుతూ పనులను పరిశీలిస్తున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పనులు చేస్తున్నారు. గడిచిన కొన్ని రోజులుగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి.. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి డివిజన్ బాట కార్యక్రమం చేపడుతూ రెండేళ్లలో జరిగిన అభివృద్ధిని వివరిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ కార్పొరేషన్ ను పట్టించుకోలేదని ఆరోపణలు చేస్తున్నారు. అభివృద్ధి కాంగ్రెస్ ద్వారానే జరుగుతుందని నిధులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తుందని ప్రకటనలు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు