
హైదరాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.)
పటాన్ చెరు నియోజకవర్గంలో
మున్సిపల్ ఎన్నికల తరువాత రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరడం, సెగ్మెంట్ లో ఐదు మున్సిపాలిటీను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం వెనువెంటనే జరిగిపోయాయి. ఎప్పుడొచ్చామని కాదు.. బుల్లెట్ దిగిందా..? లేదా..? అని మహిపాల్ రెడ్డి వేసిన డైలాగ్ నేరుగా వెళ్లి కాంగ్రెస్ అధిష్టాన్ని తగిలింది. ఆయనను వద్దంటే కాంగ్రెస్ చేర్చుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ఆ బుల్లెట్ దిగిందని స్వయంగా సొంత పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. గూడెం పార్టీలకు రావడంతో రెండేళ్లలో కాంగ్రెస్ కు చాలా నష్టం జరిగిందని, సెగ్మెంట్ లో మొత్తం ఆయన తీసుకువచ్చిన అధికారులే ఉన్నారని, స్థానిక కాంగ్రెస్ నాయకులు అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. ఈ వరుస పరిణామాలతో పార్టీ అధిష్టానం చర్యలకు పూనుకోనున్నట్లు తెలుస్తోంది. మొదటగా అధికారుల బదిలీ చేపట్టనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనితో అధికారుల్లో భయం మొదలైంది.
నియోజకవర్గంలో ఇస్నాపూర్, జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం, ఇద్రేశం.. ఐదు మున్సిపాలిటీలు బీఆర్ఎస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడారు. మున్సిపల్ ఎన్నికల్లో నేరుగా బీఆర్ఎస్ కు సపోర్ట్ చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు, మహిపాల్ రెడ్డి, పార్టీ నియోకజవర్గ ఇన్ చార్జి ఆదర్శరెడ్డి, ఇతర నేతలంతా వ్యూహాత్మకంగా వ్యవహరించి మున్సిపల్ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు. కాగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఓటుతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ ను తమ వైపు తిప్పుకుని ఇస్నాపూర్ మున్సిపాలిటీని సొంతం చేసుకున్నారు.
తమ పార్టీ కౌన్సిలర్ తో మున్సిపాలిటీని కాంగ్రెస్ కు రాకుండా చేయడాన్ని కూడా అధిష్టానం సిరియస్ గా తీసుకున్నది. ఆ ఎన్నిక ప్రక్రియ పూర్తయిన తరువాత 'బుల్లెట్ దిగిందా లేదా..? అని మహిపాల్ రెడ్డి డైలాగ్ వేశారు. ఆ డైలాగ్ రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ డైలాగ్ తోనే అధిష్టానం పటాన్ చెరు పాలిటిక్స్ పై దృష్టి సారించేలా చేసిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు