
హైదరాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.)
కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి ఆశలకు చెక్ పడిందనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతున్నది. అందుకు ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడమే కారణంగా చూపుతున్నారు. సొంత సెగ్మెంట్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేని వ్యక్తికి మంత్రి పదవి అడిగే నైతికత ఉంటుందా? అని ఆయన వ్యతిరేకులు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రి పదవి కోసం ఆశలు పెట్టుకున్న ఇతర ఎమ్మెల్యేలు కేబినెట్ బెర్త్ తమను వరిస్తుందన్న దీమాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు పదవి ఇవ్వాలని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మొదటి నుంచి పబ్లిక్గానే డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ సామాజిక సమీకరణల నేపథ్యంలో సాధ్యం కాదని, అందుకు ప్రతిగా చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తామని పార్టీ ఆఫర్ ఇవ్వగా అందుకు అంగీకరించకుండా మంత్రి పదవి కావాలని కేబినెట్ తేల్చిచెప్పినట్లు ప్రచారం జరిగింది. పునర్వ్యవస్థీకరణ వేళ సర్దుబాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని పార్టీ కీలక నేతలు సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. అయితే నియోజకవర్గం కేంద్రంగా ఉన్న ఇబ్రహీంపట్నంలో మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం చెందడంతో ఆయన పేరును ఇప్పుడు ఆశావహుల లిస్టు నుంచి తొలగించే పరిస్థితి ఏర్పడిందని పార్టీలో చర్చ జరుగుతన్నది.
ఈ మధ్య జరిగిన మున్సిపల్ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న మల్రెడ్డి రంగారెడ్డికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. మంచి మెజార్టీతో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని గెలుస్తామని ధీమాలో ఉన్న ఆయనకు ఫలితాలు షాక్ ఇచ్చాయి. బీఆర్ఎస్ అత్యధికంగా 13 వార్డులు గెలిచుకుని చైర్మన్ పదవిని సొంతం చేసుకునే మెజార్టీని సాధించింది. దీంతో కాంగ్రెస్ మున్సిపల్ పీఠాన్ని గెలుచుకునేందుకు ఉపయోగించిన వ్యూహాలు సైతం బెడిసికొట్టాయని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు