
హైదరాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.) చలో కామారెడ్డి కార్యక్రమానికి తెలంగాణ బీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో మల్కాజిరి ఎంపీ ఈటల రాజేందర్ నివాసానికి ఆదివారం ఉదయం పోలీసులు మళ్లీ చేరుకున్నారు. ఆయన బయటకు వెళ్లకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా ఇంటి వద్ద గస్తీ ఏర్పాటు చేశారు. బయటికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు ఈటల రాజేందర్కు తెలియజేసినట్లు సమాచారం. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు. దీనితో కామారెడ్డి పరిస్థితి నేపథ్యంలో ఏ క్షణానికి ఏమి జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది.
కామారెడ్డికి వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడాన్ని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా తన పార్టీ ఎమ్మెల్యేకు సంఘీభావం తెలపడానికి వెళ్లడం కూడా నేరమా అని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇదే తరహా హౌస్ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసిందని, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అదే విధానాన్ని అనుసరిస్తున్నారని విమర్శించారు.ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే ప్రతిపక్షాలపై ఆంక్షలు విధించడం సరికాదన్నారు. సంఘీభావం తెలపడానికి వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులను హౌస్ అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విరుద్దమని ఈటెల పేర్కొన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలే గూండా నిజానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విధానం పై ప్రభుత్వం సిగ్గుపడాలని, ప్రజలు తగిన సమాధానం చెబుతారని ఆయన హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..