
ఝార్ఖండ్, 22 ఫిబ్రవరి (హి.స.)
జార్ఖండ్లోని పశ్చిమ సింగ్సూమ్ జిల్లాలో జరిగిన భారీ ఐఈడీ పేలుడులో సీఆర్పీఎఫ్ (CRPF) 209 కోబ్రా బెటాలియన్కు చెందిన ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. సారండా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు నిర్వహిస్తున్న కూంబింగ్ ఆపరేషన్ లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన IED మందుపాతర పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది.
ఛోటా నగరా పోలీస్ స్టేషన్ పరిధిలోని చద్రి డేరా గ్రామ సమీపంలో జిల్లా పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నిషేధిత సీపీఐ (మావోయిస్టు) సభ్యుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో అడవిని జల్లెడ పడుతున్న సమయంలో జవాన్లు అనుకోకుండా మందుపాతరపై కాలు వేశారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఇద్దరు కోబ్రా జవాన్లు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పశ్చిమ సింగ్సూమ్ ఎస్పీ అమిత్ రేణు ఈ ఘటనను ధృవీకరించారు. మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాల్లో భాగంగా అడవిలోకి వెళ్లిన సమయంలో ఈ పేలుడు జరిగిందని ఆయన తెలిపారు. ఘటన తర్వాత ఆ ప్రాంతంలో భద్రతా దళాలు తనిఖీలను మరింత ముమ్మరం చేశాయని, అదనపు బలగాలను రంగంలోకి దించినట్లు వెల్లడించారు.
సారండా అటవీ ప్రాంతం దశాబ్దాలుగా మావోయిస్టులకు ప్రధాన స్థావరంగా ఉంది. ఇటీవల కాలంలో భద్రతా దళాలు వరుస విజయాలు సాధిస్తుండటంతో, వారిని అడ్డుకునేందుకు మావోయిస్టులు అక్కడక్కడ ఐఈడీలను అమర్చుతున్నట్లు భద్రతా సంస్థలు గుర్తించాయి. ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం స్థానిక ప్రజలను హెచ్చరించింది. అడవుల్లోకి అనవసరంగా వెళ్లవద్దని, ఏదైనా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరింది. ఈ ప్రాంతంలో శాంతిభద్రతల పునరుద్ధరణ కోసం మావోయిస్టుల ఏరివేత చర్యలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..