
సూర్యాపేట, 22 ఫిబ్రవరి (హి.స.) మున్సిపాలిటీల్లో కొలువు దీరిన
నూతన పాలక సభ్యులకు కొత్త సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. సూర్యాపేట మున్సిపాలిటీలో సమస్యలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. ముఖ్యంగా గత ఏడాదిలో ప్రత్యేకాధికారుల పాలనలో సమస్యలు పరిష్కారం కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సూర్యాపేట లో ప్రధానంగా అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. డ్రైనేజీల్లో నెలల తరబడి పూడికతీత మరుగునపడిన, మురికి నీరు నిల్వ ఉండి తీవ్ర వాసన వెదజల్లుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో దోమల నివారణకు ఫాగింగ్ చేసిన దాఖలాలు లేవు. దోమల నివారణ మందు సైతం డ్రైనేజీల్లో పిచికారీ చేయలేదు.
మినరల్ వాటర్ ప్లాంట్లు గతి..
సూర్యాపేట మున్సిపాలిటీలో ప్రజలను తాగునీటి సమస్య విపరీతంగా వేదిస్తోంది. మిషన్ భగీరథ పథకం నుంచి రక్షిత మంచినీరు సరఫరా చేస్తున్నామని చెప్పుకుంటున్న సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో నీటి సరఫరాపై దృష్టి సారించడం లేదు. ఫలితంగా రోజు విడిచి రోజు, మూడు రోజుల కోక సారి ప్రజలకు కుళాయిల ద్వారా తాగునీరు అందుతుంది. దీంతో పుర ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. మంచినీరు సక్రమంగా సరఫరా కాకపోవడంతో ప్రైవేటు మినరల్ వాటర్ ప్లాంట్లలో కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని వివిధ రిజర్వాయర్లలో కనీసం క్లోరివేషన్ చేసిన పాపాన కూడా పోకపోవడం గమనార్హం. కొన్నేళ్లుగా నీళ్ల ట్యాంక్ లో బ్లీచింగ్ పౌడర్ తో శుద్ధి చేసిన దాఖలాలు కూడా లేవు.
మున్సిపాలిటీలోని విలీన గ్రామాల్లో కొంత కాలంగా సమస్యలు తిష్ట వేశాయి. సూర్యాపేటకు ఆనుకొని ఉన్న కొన్ని గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేశారు ఆ పరిసర గ్రామాల్లో ఇప్పటికీ సరియైన వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రక్షిత మంచి నీరు ప్రజలకు అందని ద్రాక్ష లాగా తయారైంది. మిషన్ భగీరథ పథకం లో భాగంగా ఇంటింటా నల్లాలు ఏర్పాటు చేసినప్పటికీ పూర్తిస్థాయిలో నీరు సరఫరా కావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అంతర్గత రోడ్లు సైతం పూర్తి అధ్వానంగా ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు