
ఆలమూరు, 22 ఫిబ్రవరి (హి.స.)అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆదివారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. ఆలమూరు మండలం మడికి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు కారు మొత్తానికి వ్యాపించి వాహనం పూర్తిగా అగ్నిగోళంలా మారిపోయింది.
మడికి వద్ద కారు వెళ్తుండగా ఇంజిన్ నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్, వెంటనే అప్రమత్తమై వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపివేశారు. కారులోని ప్రయాణికులు తక్షణమే కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నిమిషాల వ్యవధిలోనే మంటలు వాహనం అంతటా వ్యాపించాయి. అయితే, నడిరోడ్డుపై కారు భారీ మంటలతో కాలిపోతుండటం, టైర్లు పేలుతున్న శబ్ధాలకు స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాద తీవ్రతను చూసి భయంతో అటు ఇటు పరుగులు తీశారు. రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే కారు పూర్తిగా కాలిబూడిదైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV