
చతిస్గడ్, 28 ఫిబ్రవరి (హి.స.)
ఛత్తీస్గఢ్ (Chhattisgarh)
శాసనసభలో శనివారం ఓ చారిత్రాత్మక, భావోద్వేగపూరితమైన దృశ్యం ఆవిష్కృతమైంది. దశాబ్దాల పాటు అడవుల్లో తుపాకీ పట్టి పోరాటం చేసిన సుమారు 120 మంది లొంగిపోయిన మావోయిస్టులు ప్రజాస్వామ్య దేవాలయం వంటి అసెంబ్లీని సందర్శించారు. ఈ సందర్భంగా వారందరికీ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్ శర్మ (Vijay Sharma) ఘన స్వాగతం పలికారు. అనంతరం గౌరవ సూచకంగా రెడ్ కార్పెట్ పరిచి, గులాబీ పూలు ఇచ్చి మరీ లోపలికి ఆహ్వానించారు. ఇందులో ఝిరామ్ ఘాట్ (Jhiram Ghat) ఘటన మాస్టర్మైండ్గా భావిస్తున్న రూ. కోటి రివార్డు ఉన్న తక్కళ్లపల్లి వాసుదేవ రావు అలియాస్ రూపేష్(Roopesh) అలియాస్ ఆశన్న (Aashanna), రూ.25 లక్షల రివార్డు ఉన్న చైతూ లాంటి అగ్రశ్రేణి మాజీ కమెండర్లు ఉండటం విశేషం.
మాజీ మావోయిస్టులు అసెంబ్లీ గ్యాలరీలో కూర్చుని సభానడకను, ప్రజాస్వామ్య ప్రక్రియను ఆసక్తిగా గమనించారు. సభాపతి (Speaker) ప్రత్యేకంగా వీరి రాకను సభలో ప్రకటించి అభినందించార. అయితే, ఈ పర్యటనకు ముందు రోజే డిప్యూటీ సీఎం విజయ్ శర్మ తన నివాసంలో వీరికి ప్రత్యేక విందు (Dinner) ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ప్రకటించిన పునరావాస పథకం ప్రయోజనాలు పొందడానికి మార్చి 31, 2026 ఆఖరి తేదీ అని, ఆలోపు మిగిలిన వారు కూడా ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.
ప్రభుత్వం తమ పట్ల వ్యవహరించే తీరు మార్పు ఉంది.. ఆశన్న...
అసెంబ్లీ సందర్శన వేళ మాజీ మావోయిస్టు అగ్రనేత ఆశన్న కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అడవుల్లో ఉన్నప్పుడు దేని కోసం అయితే పోరాడామో, ఇప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల సమస్యల కోసం తమ శక్తిమేర పని చేస్తామని అన్నారు. తమ పట్ల ప్రభుత్వం వ్యవహరించే మార్పు ప్రస్పుటంగా కనిపిస్తోందని అన్నారు. జైల్లో ఉన్న మరికొందరు సహచరుల విడుదల గురించి కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించన చేయాలని తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అన్నారు.
అనంతరం డిప్యూటీ సీఎం విజయ్ శర్మ మాట్లాడుతూ.. తుపాకీ పట్టిన చేతులతో మావోయిస్టులు రాజ్యాంగ పుటలను పట్టుకోవడం శుభపరిణామమని అన్నారు. ఆయుధాలు వీడితే చేరదీసి ఆదరిస్తామని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పునరావాస నిధుల పంపిణీలో ఎలాంటి అవకతవకలు లేవని, ఇప్పటికే రూ.10 కోట్లకు పైగా కేటాయించామని విజయ్ శర్మ వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు