
న్యూఢిల్లీ, 28 ఫిబ్రవరి (హి.స.)
తెలంగాణ రాజకీయాల్లో రాజ్యసభ ఎన్నిక ఆసక్తిగా మారింది. రాష్ట్రం నుంచి రెండు స్థానాలకు జరగనున్న ఎన్నికలో అవకాశం కోసం టీ కాంగ్రెస్ లో తీవ్రమైన పోటీ కనిపిస్తోంది.
అవకాశం దక్కితే చాలు గెలుపు ఖాయమనే అంచనాలతో ఈ చాన్స్ వదులుకోవద్దని పార్టీలోని సీనియర్లంతా ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలో సీనియర్ నేత వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి పార్టీలో నా పనిని చూసి తప్పనిసరిగా అవకాశం ఇవ్వాలని కోరారు. ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీలో పని చేసే వారికే అవకాశం ఉంటుందని మొన్ననే వికారాబాద్ లో జరిగిన డీసీసీ శిక్షణ తరగతుల్లో సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్ చెప్పారని పార్టీలో నేను పని చేస్తూనే ఉన్నానని కావాలని ఏమి అడగడం లేదన్నారు. నా ఎబిలిటి చూసి అవకాశం ఇవ్వాలన్నారు. ఈ పదేళ్లలో అందరికంటే ఎక్కువ కేసులు నామీదే నమోదయ్యాయని అయినా నేను భయపడలేదన్నారు. కాంగ్రెస్ సిపాయిగా, ఇందిరాగాంధీ కుటుంబానికి లాయల్ గా పని చేస్తున్న తనకు అధిష్టానం మీద, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మీద నమ్మకం ఉందన్నారు.
చాలా మంది ఫోన్లు చేస్తున్నారు:
రాజ్యసభ అవకాశంపై చాలా మంది కార్యకర్తలు నాకు ఫోన్లు చేస్తున్నారని అన్నారు. తనకు పోన్లు చేస్తున్న వారికి ఒక్కటే చెబుతున్నాను. మనం పని చేసుకుంటూ వెళ్లాం. మిగతాది హైకమాండ్ మీద వదిలేదామన్నారు. నా జీవితంలో ఎవరికి అన్యాయం చేయలదేని నాకు న్యాయం జరుగుతుందన్నారు. నాకు రెండు సార్లు అన్యాయం జరిగినా పార్టీ జెండానే మోస్తున్నానని అన్నారు. తనకు అవకాశం కోసం సీఎం రేవంత్ రెడ్డితో మల్లికార్జున ఖర్గేను కలిశానన్నారు. సోనియా గాంధీకి లేఖ రాశానన్నారు. గడిచిన పదేళ్లలో తనకు ఎలాంటి పదవి లేదని బీసీ బిడ్డనైన తనకు ఈసారి అవకాశం దక్కుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. నాకు జాతీయ రాజకీయాల్లో పరిచాయాలు ఉన్నాయని రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలంటే నేను ఢిల్లీలో ఉంటే మిగతా రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటానన్నారు. పార్టీ బలపడాలంటే బలమైన వ్యక్తులకు అవకాశం దక్కాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..