
హైదరాబాద్, 28 ఫిబ్రవరి (హి.స.)
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లతో పాటు ఇప్పుడు దేవాలయాలు, మఠాలను సైతం కూల్చేందుకు కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ల హరీశ్ రావు మండిపడ్డారు. కోకాపేట్ నియోపోలిస్లోని విశాఖ శారద పీఠం, రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని రెవెన్యూ, పోలీసు అధికారులు అకస్మాత్తుగా చుట్టుముట్టి ఖాళీ చేయాలంటూ భయాందోళనలకు గురిచేస్తున్న నేపథ్యంలో హరీశ్రావు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఆలయాన్ని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
వినాశకాలే విపరీత బుద్ది అన్నట్లు రేవంత్ రెడ్డి పాలన తయారైందని హరీశ్రావు అన్నారు. అడ్డగోలు వ్యవహారాలకు, అక్రమాలకు పాల్పడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా దేవాలయాలు, మఠాలను కూడా కూల్చే స్థాయికి దిగజారిందని విమర్శించారు. 2019లో కేసీఆర్ ప్రభుత్వంలో కోకాపేట సర్వే నెంబర్ 240లో విశాఖ శారద పీఠానికి చట్టబద్ధంగా క్యాబినెట్ ఆమోదంతో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించామని తెలిపారు. పీఠం నిర్వాహకులు ప్రభుత్వానికి 1.05 కోట్లు చెల్లించి రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారని పేర్కొన్నారు. అలాగే హెచ్ఎండీఏ కు రూ. 23 లక్షలు చెల్లించి అనుమతులు, విద్యుత్ కనెక్షన్ అన్నీ తీసుకున్నారని చెప్పారు. ఇక్కడ అద్భుతమైన శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి దేవాలయం, గోశాల, నిత్య అన్నదాన సత్రం, వేద పాఠశాల నిర్మించారని అన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు, అధికారుల సమక్షంలో పెద్ద స్వామీజీ చేతుల మీదుగా ప్రతిష్టా కార్యక్రమం జరిగిందని గుర్తుచేశారు. అప్పటి నుంచి ఇక్కడ నిత్య పూజలు జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్లో శారద పీఠం కింద 16 దేవాలయాలు, లక్షలాది మంది భక్తులు ఉన్నారని తెలిపారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తా అంటూ.. కేసీఆర్ కట్టిన గుళ్లు, గోపురాలు, మఠాలను కూల్చడమేనా రేవంత్ రెడ్డి ఉద్దేశమని మండిపడ్డారు.
హైదరాబాద్లో హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చావు, ఖమ్మంలో ఇళ్లు కూల్చి 800 మందిని రోడ్డున పడేశావు. నీ పాలనలో అంతా కూల్చడమే తప్ప, నిర్మాణం లేదా అని సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటర్ వర్క్స్ HMWSSB కోసం ఈ స్థలం తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోందని తెలిపారు. వాటర్ వర్క్స్ కట్టాలంటే ఈ దేవాలయం స్థలమే దొరికిందా.. సరిగ్గా ఈ ఆలయానికి రోడ్డు అవతలే సర్వే నెంబర్ 239, 240 లలో 17 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది కదా, వాటర్ వర్క్స్ అక్కడ కట్టుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. ఆ 17 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి తన అల్లుడికి, మేనల్లుళ్లకు, వాళ్ల అనుచరులకు భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ అక్రమంగా కట్టబెట్టారని తెలిపారు. సమాచార హక్కు చట్టం కింద నేనే స్వయంగా అడిగితే ప్రభుత్వం ఇచ్చిన జవాబు ఇది అని తెలిపారు.. 10 ఎకరాలు ఇస్తే వాళ్లు 17 ఎకరాలు కబ్జా పెట్టారని పేర్కొన్నారు. ఓపెన్ ఆక్షన్ వేస్తే ప్రభుత్వానికి వందల కోట్లు వచ్చేవి. కానీ లోపల లోపల నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని మండిపడ్డారు.
హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం ఓఆర్ఆర్కు కిలోమీటర్ లోపల ఎలాంటి క్రషర్లు ఉండకూడదు.. కానీ రేవంత్ రెడ్డి తన అల్లుడి కోసం ఇక్కడ ఏకంగా 5 రెడీమిక్స్ ప్లాంట్లు, క్రషర్లు పెట్టించారని హరీశ్రావు తెలిపారు. పక్కన ఉన్న బిల్డర్లంతా తన అల్లుడి దగ్గరే కంకర కొనాలని, లేకపోతే అనుమతులు ఇవ్వమని బెదిరిస్తూ దందా చేస్తున్నారని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..