
హైదరాబాద్, 28 ఫిబ్రవరి (హి.స.)దిల్లీ మద్యం కేసుతో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో రాజకీయంగా నష్టపోయింది మాత్రం భారాస పార్టీయేనని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. కవితకు కోర్టులో ఈ రోజు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. దిల్లీ మద్యం కేసుపై కోర్టు తీర్పు నేపథ్యంలో.. శుక్రవారం ‘ఎక్స్’లో కేటీఆర్ స్పందించారు. ‘‘మద్యం కుంభకోణం.. అనే సాకుతో దిల్లీలో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వాన్ని కూల్చారు. ఆ కేసు కారణంగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో రాజకీయంగా నష్టపోయింది మాత్రం భారాసనే. ఇదేవిధంగా మా నాయకులపై నమోదైన ప్రతి కేసు అబద్ధమని, రాజకీయ ప్రేరేపితమని, కల్పితమని త్వరలోనే తేలిపోతుంది. కాంగ్రెస్, భాజపాలు చేసే బాధ్యతారహితమైన ఆరోపణలను మనం చూశాం. సత్యం గెలిచే వరకూ... ఈ అసత్యాలే ప్రచారంలో ఉన్నాయి. అసత్య, కుట్రపూరిత కేసులను, ఆరోపణలను వివిధ మాధ్యమాల ద్వారా మరింత పెద్దవి చేసి.. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, మా ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. దురదృష్టవశాత్తూ సాక్ష్యాల కంటే ఆరోపణలకే ప్రాధాన్యమిస్తూ.. న్యాయ ప్రక్రియ కంటే మీడియా కథనాలే మిన్న అనే ధోరణి ఈ నవభారతంలో అలవాటుగా మారిపోయింది.
కానీ, చివరికి న్యాయమే గెలుస్తుంది’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. దిల్లీ మద్యం కేసులో కడిగిన ముత్యంలా తీర్పు ఉంటుందని భారాస అధినేత కేసీఆర్ ఆనాడే చెప్పారని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రత్యర్థులను అణచివేయడమే లక్ష్యంగా కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అల్లిన కుట్రలు ఒక్కొక్కటిగా వీగిపోతుండటం హర్షించదగ్గ విషయమని ఆయన పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోదియా, కల్వకుంట్ల కవిత వంటి నాయకులపై మోపిన అక్రమ కేసులు.. కేవలం రాజకీయ కక్షతో కూడుకున్నవని కోర్టు తీర్పుల ద్వారా స్పష్టమవుతోందని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్