
ఒడిశా, 28 ఫిబ్రవరి (హి.స.)
ఒడిశా పోలీసులు చేపట్టిన ప్రత్యేక
ఆపరేషన్ విజయవంతం అయింది. కోరాపుట్ జిల్లా పోలీసులు జలపుట్ రిజర్వాయర్ (Jalaput Reservoir) సమీపంలో సాహసోపేతమైన ఆపరేషన్ నిర్వహించి భారీ స్థాయిలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా హష్ ఆయిల్ తయారీ జరుగుతోందన్న పక్కా సమాచారంతో జిల్లా ఎస్పీ రోహిత్ వర్మ నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి. నీటి మధ్యలో ఉన్న ఒక ద్వీపంలో ఈ తయారీ యూనిట్లు ఉండటంతో, పోలీసులు పడవల్లో అక్కడికి చేరుకొని డ్రగ్స్ మాఫియా స్థావరాన్ని సీజ్ చేశారు.
డ్రోన్లతో నిఘా.. భారీ రికవరీ
పోలీసులు పడవల్లో ద్వీపానికి చేరుకున్న తర్వాత, దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న తయారీ కేంద్రాలను గుర్తించేందుకు డ్రోన్లను ఉపయోగించారు. దీంతో వారు ఉన్న ప్రాంతాన్ని స్పష్టంగా గుర్తించడం సులువు అయింది. ఈ దాడుల్లో సుమారు 1,800 లీటర్ల హష్ ఆయిల్, ఒక ట్యాంక్ నిండా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఈ మాదకద్రవ్యాల విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ. 200 కోట్లు ఉంటుందని అంచనా. ఈ దాడుల్లో రెండు తాత్కాలిక తయారీ యూనిట్లను ధ్వంసం చేసిన పోలీసులు, ఈ దందా వెనుక ఉన్న పూర్తి నెట్వర్క్ ను వెలికితీసేందుకు ఆపరేషన్ ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..