
రంగారెడ్డి, 23 ఫిబ్రవరి (హి.స.) రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని నాగర్ గూడ చౌరస్తాలో ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. షాబాద్ సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైతాబాద్ గ్రామానికి చెందిన దాసరి అజయ్ (19), హైదర్ గూడా ఉదయ్ కిరణ్(20), ఎండి అజాన్(19) ముగ్గురు కలిసి ద్విచక్ర వాహనంపై చేవెళ్ల నుంచి హైతాబాద్ కు వస్తున్నారు. ఈ క్రమంలో మార్గ మధ్యలో నాగర్ గూడ చౌరస్తాలో ఆదివారం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో వెనకాల నుండి వచ్చిన కంటైనర్ లారీ ఢీ కొట్టడంతో దాసరి అజయ్, హైదర్ గూడా ఉదయ్ కిరణ్ అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన ఎండి అజాన్ ను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతి చెందిన వ్యక్తుల మృతదేహాలను చేవెళ్లలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు హైదర్ గూడా ఉదయ్ కిరణ్ తండ్రి రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు షాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు