
హైదరాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.)
అక్రమ లక్కీ డ్రా స్కీమ్ పై అప్రమత్తంగా ఉండాలని మేడిపల్లి పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మోహన్ కుమార్ ఆదేశాలతో గత రాత్రి బోడుప్పల్ సర్కిల్, బోల్లి గూడెం, సూరజ్ నగర్ కాలనీ వద్ద సౌదా సోతు సరస్వతి(47), సౌదా సోతు పరశురాం (27)లు కలిసి ప్రభుత్వం నిషేధించిన లక్కీ స్కీమ్ నిర్వహిస్తున్నట్లు సమాచారంతో దాడులు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు. కూపన్ ధర 299 /- రూపాయలుగా నిర్ణయించి ఒక వ్యక్తికి గరిష్టంగా ఐదు కూపన్లు అమ్ముతున్నట్లు గుర్తించారు.
స్కీమ్లో భాగంగా.. కారు, బుల్లెట్ బైక్, సాధారణ బైక్, స్కూటీ, ఐఫోన్ వంటి భారీ బహుమతులు ప్రకటించి ప్రజలను ఆకర్షిస్తున్నారు. మొత్తం 5000 కూపన్లు ముద్రించగా వాటిలో 1500 కూపన్ లు గ్లాస్ డ్రా బాక్స్ లో మరియు 3500 కాళీ కూపన్లు స్థలంలో లభించాయి. అదేవిధంగా ఒక పేటీఎం స్కానర్ మరియు సాంసంగ్ మొబైల్ ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేదా చట్టబద్ధమైన నమోదు లేనందున సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రజలు ఇలాంటి అక్రమ లక్కీ డ్రా స్కీం లు, ఆన్లైన్ మోసాలు మరియు అనుమతి లేని పథకాల పై అప్రమత్తంగా ఉండాలని మేడిపల్లి పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు