
వికారాబాద్, 28 ఫిబ్రవరి (హి.స.)
వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఓ మహిళా కానిస్టేబుల్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ పట్టణంలోని గంగారం సాయిబాబా కాలనీలో నివాసం ఉంటున్న మహిళా పోలీస్ కానిస్టేబుల్ దివ్య శనివారం ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వికారాబాద్ పట్టణ పోలీసులు వెంటనే స్పాట్కు చేరుకుని దర్యాప్తును ప్రారంభించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ సందర్భంగా వికారాబాద్ సీఐ రఘు కుమార్ మాట్లాడుతూ.. మృతురాలు దివ్య ధారూర్ పోలీస్ స్టేషన్లో రైటర్గా పనిచేస్తున్నట్లుగా తెలిపారు. దివ్య సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుందని, ఆ లేఖలో 'తన చావుకు ఎవరూ కారణం కాదని.. నాన్న లేకపోవడం వల్లే మనకు ఇన్ని బాధలు' అని మాత్రమే ఉందని సీఐ వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యతో కుటుంబ సభ్యులు, సహచరులు, కాలనీ వాసులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు