
, అన్నమయ్య జిల్లా01 మార్చి (హి.స.)
తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోట మండలంలోని ప్రఖ్యాత పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ సెక్షన్ పరిధిలోని అడవుల్లో మంటలు వ్యాపించాయి. కొండ దిగువన ఉన్న సెరికల్చర్ ఫాం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు శనివారం నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి. నాయనిబావి, గట్టు, సూరపువారిపల్లె అటవీ ప్రాంతాలు అగ్నికి ఆహుతయ్యాయి. గుట్టల్లో మంటలు ప్రారంభమై క్రమంగా గట్టుకొండ, ముక్కొండ, గుర్రపుగుట్టల వరకు విస్తరించాయి. ఎండిన ఆకులు, బోద, గడ్డి అధికంగా ఉండటంతో మంటలు శరవేగంగా విస్తరించి రాత్రి వరకు 600 ఎకరాలకు పైగా అడవి దగ్ధమైందని స్థానికులు చెప్పారు. మంటల ధాటికి తట్టుకోలేక జంతువులు పరుగులు తీస్తున్నాయని, కొన్ని మంటల్లో కాలిపోతున్నాయని వెల్లడించారు. అటవీశాఖ సెక్షన్ అధికారి శివకుమార్ మాట్లాడుతూ.. సెరికల్చర్ ఫాం వద్ద మంటలు పూర్తిగా ఆర్పివేశామని, మిగిలినచోట్ల అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ