
వేట్లపాలం, 01 మార్చి (హి.స.)
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు(Vetlapalem Blast incident) సంభవించిన విషయం తెలిసిందే. ప్రమాదస్థలిని పరిశీలించి, బాధితులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరామర్శించారు.
రాత్రి 11గంటల 40 నిమిషాలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..వేట్లపాలెం చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించారు. పేలుడు ఘటనకు గల కారణాలపై జిల్లా కలెక్టర్, ఎస్పీలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి పవన్ కల్యాణ్ ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వేట్లపాలెం ఘటన చాలా బాధాకరం. పేలుడు ఘటనతో స్పాట్లోనే 21 మంది మృతిచెందారు. మరో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల్లో ఎక్కువగా పేదలే ఉన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, తొమ్మిది మంది మహిళలు ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు జరుగకుండా చూసుకుంటాం. ఘటనపై విచారణకు ఆదేశిస్తున్నాం. డీఎస్పీ, ఆర్డీవో సహా నలుగురు అధికారులను తక్షణమే సస్పెండ్ చేశాం. బాధ్యులపై తప్పకుండా క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. ఆస్తులను కూడా జప్తు చేస్తాం. దోషులను కఠినంగా శిక్షిస్తాం. సరైన జాగ్రత్తలు తీసుకోవడంలో ఫ్యాక్టరీ నిర్వాహకులు విఫలం అయ్యారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేలితే మరిన్ని చర్యలు తీసుకుంటాం. క్రాకర్స్ ఫ్యాక్టరీల నిర్వహణకు నిబంధనలు కఠినతరం చేస్తాం. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తాం. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం. బాధితుల పిల్లలను కూడా ప్రభుత్వమే చదివించే విధంగా చర్యలు తీసుకుంటాం, ఇల్లు లేని వారికి ఇళ్లు ఇస్తాం’ అనిడిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV