
ఢిల్లీ, 11,మార్చి (హి.స.) దాదాపు 13 ఏళ్లుగా కోమాలో ఉండి జీవచ్ఛవంలా మారిన 32 ఏళ్ల హరీశ్ రాణా కారుణ్య మరణం అంశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాణాకు చికిత్స నిలిపివేయొచ్చని పేర్కొన్న న్యాయస్థానం.. అతడి కారుణ్య మరణానికి అనుమతి ఇచ్చింది. (Harish Rana Euthanasia). తన కుమారుడికి కారుణ్య మరణం ప్రసాదించాలంటూ హరీశ్ తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం తీర్పు వెలువరించింది. ఇలా దేశంలో ఓ వ్యక్తికి కారుణ్య మరణం ప్రసాదించడం ఇదే తొలిసారి.
దిల్లీకి చెందిన 32 ఏళ్ల హరీశ్ రాణా 2013 ఆగస్టు 20న చండీగఢ్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో ప్రమాదానికి గురయ్యాడు. నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కిందపడిపోవడంతో అతడి తలకు తీవ్ర గాయమైంది. శరీరం కదలలేని స్థితికి చేరుకుంది. ప్రముఖ ఆసుపత్రుల్లో చికిత్స అందించినా, అతని ఆరోగ్యంలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. అప్పటినుంచి అతడు కోమాలోనే ఉండిపోయాడు.
ఇన్నేళ్లుగా అతడి తల్లిదండ్రులు ఇంట్లోనే ఉంచి హరీశ్ను చూసుకుంటున్నారు. కుమారుడి చికిత్స కోసం ఆర్థికంగా, మానసికంగా చితికిపోయిన ఆ తల్లిదండ్రులు అతడి కారుణ్య మరణానికి అనుమతించాలంటూ 2024లో దిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. వారి పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లినా నిరాశే ఎదురైంది. అయితే, హరీశ్ కోలుకునే అవకాశం లేదని వైద్యులు మరోసారి నివేదికలు ఇవ్వడంతో అతడి కుటుంబం మళ్లీ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మెడికల్ రిపోర్ట్లను పరిశీలించిన కోర్టు.. హరీశ్ కేసును విచారించేందుకు అంగీకరించింది. ఈ ఏడాది జనవరి 13న అతడి తల్లిదండ్రులతో మాట్లాడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మానవీయకోణంలో మర్యాదపూర్వక చావును (ప్రసాదించాలని అప్పుడు వారు కోర్టును వేడుకున్నారు. ఆ సందర్భంగా ఈ కేసులో ప్రాణాధార వైద్య చికిత్సను ఉపసంహరించే అంశాన్ని మాత్రం తాము పరిశీలిస్తామంటూ తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా కారుణ్య మరణానికి అనుమతి ఇచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ