
షిర్డీ: 15,మార్చి (హి.స.) పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుని, ఇంధన సంక్షోభం తరుముకొస్తున్న ప్రస్తుత తరుణంలో, మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. అత్యాధునిక సౌర శక్తి వినియోగంతో వేల సంఖ్యలో భక్తుల ఆకలిని తీరుస్తూ, పర్యావరణ హితంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. రోజుకు ఏకంగా 40 వేల మంది భక్తులకు సూర్యరశ్మి సాయంతో వండిన వేడివేడి ప్రసాదాన్ని అందిస్తోంది షిర్డీ ట్రస్ట్.
షిర్డీ ప్రసాదాలయంలో సుమారు 1.37 కోట్ల రూపాయల వ్యయంతో 2009లోనే ఈ సోలార్ కుకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. మొత్తం 73 సోలార్ డిష్ల సాయంతో సూర్యరశ్మిని కేంద్రీకరించి, 150 లీటర్ల సామర్థ్యం ఉన్న 10 భారీ కుక్కర్లతో ఇక్కడ వంట చేస్తారు. ఏక కాలంలో 15 క్వింటాళ్ల బియ్యం, 5 క్వింటాళ్ల పప్పు, 5 క్వింటాళ్ల కూరగాయలను ఉడికిస్తారు. సాధారణంగా ఇంతటి స్థాయిలో వంట చేయాలంటే రోజుకు 1,700 కిలోల గ్యాస్ అవసరమయ్యేది. కానీ ఈ సోలార్ సిస్టమ్ వల్ల రోజుకు భారీగా గ్యాస్ ఆదా అవుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ