
ఢిల్లీ, 11,మార్చి (హి.స.) ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ఖమేనీ కుమారుడు మోజ్తాబా నియమితులయ్యారు. ఈ ప్రక్రియ జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు మోజ్తాబా బహిరంగంగా ఎక్కడా ప్రత్యక్షం కాలేదు. అమెరికా, ఇజ్రాయెల్తో జోరుగా యుద్ధం జరుగుతున్నప్పటికీ ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదు. దీంతో తాజాగా కొత్త కథనాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో మోజ్తాబా తీవ్రంగా గాయపడినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లుగా అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇరాన్ రాష్ట్ర మీడియా కూడా మోజ్తాబా గాయపడినట్లుగా ధృవీకరించింది. కానీ తాజా ఆరోగ్య పరిస్థితిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దీంతో అంతర్జాతీయ మీడియాలో రకరకాలైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మోజ్తాబాకు సీరియస్గా ఉందని.. రహస్య ప్రాంతంలో ఉన్నట్లుగా కథనాలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటి వరకు ఇరాన్ ప్రభుత్వ పెద్దలు కూడా స్పందించలేదు.
ఇక మోజ్తాబా ఖమేనీకి భద్రత పెంచేందుకు ప్రత్యేకంగా ఒక ఉగ్రవాద నిరోధక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు అమెరికన్ మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ