
ముంబయి, 11, మార్చి (హి.స.)
పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణలకు ముగింపు ఎప్పుడో తెలియని అనిశ్చితి బుధవారం మదుపర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. దాంతో నేటి ట్రేడింగ్లో దేశీయ మార్కెట్ సూచీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి . సెన్సెక్స్ ఒకదశలో 1000 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 24వేల వద్ద కదలాడుతోంది.
ఉదయం 11.50 గంటల సమయంలో సెన్సెక్స్ 943 పాయింట్లు క్షీణించి, 77,262 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 259 పాయింట్లు నష్టపోయి 24,002 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ సూచీలో జియో ఫైనాన్షియల్, కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సన్ ఫార్మా, అదానీ ఫార్మా షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎంఅండ్ఎం, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలతో మన మదుపర్లు ఒత్తిడికి గురవుతున్నారు. దాంతో నిన్నటి లాభాలకు బ్రేక్ పడింది. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ఇక ఈ యుద్ధం త్వరలో ముగియొచ్చని ట్రంప్ చెప్పినప్పటికీ.. పశ్చిమాసియాలో దాడులు మాత్రం కొనసాగుతున్నాయి. ఈ పరిణామాలు ప్రభావం చూపించాయి. మరోవైపు విదేశీ సంస్థాగత మదుపర్ల (FII) అమ్మకాలు కొనసాగుతున్నాయి. ముడిచమురు ధరలు మంగళవారం ఒక బ్యారెల్కు 10 శాతానికి పైగా తగ్గినా.. అస్థిరతలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. భారత్ ప్రధానంగా దిగుమతులపై ఆధారపడటమే ఇందుకు కారణం. దీంతో నేటి ట్రేడింగ్లో ఫ్లాట్గా ప్రారంభమైన సూచీలు.. తర్వాత ఒక శాతం మేర కుంగాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 91.89గా ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ