
ఢిల్లీ, 11 మార్చి (హి.స.)
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణను వేగవంతం చేస్తూ, రాబోయే నాలుగు వారాల్లోగా అన్ని విచారణ ప్రక్రియలను పూర్తి చేసి తుది తీర్పు వెలువరించాలని ట్రయల్ కోర్టును అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. విచారణ సందర్భంగా సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు కీలక సమాచారం అందించారు. ఈ కేసులో ఇప్పటికే మూడవ అదనపు ఛార్జిషీట్ను దాఖలు చేశామని, దర్యాప్తు ప్రక్రియను పూర్తిగా ముగించామని న్యాయస్థానానికి వెల్లడించారు.
ఛార్జిషీట్ దాఖలు పూర్తయినందున, నిందితుల బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దర్యాప్తు సంస్థ సీబీఐ, వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఆ పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. కాగా.. తాము లేవనెత్తిన కొన్ని కీలక అంశాలపై సీబీఐ సరైన దర్యాప్తు చేయలేదని సునీత తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. కేసులోని అంశాలు లేదా ఆధారాలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే ట్రయల్ కోర్టులోనే ఆశ్రయించవచ్చని సూచించింది. సెక్షన్ 207 కింద ట్రయల్ కోర్టులో దాఖలైన అన్ని పిటిషన్లను వెంటనే పరిష్కరించాలని ఆదేశించింది. తాజాగా కేసు విచారణపై సుప్రీంకోర్టు ఇచ్చిన గడువుతో వివేకా హత్య కేసు తుది దశకు చేరుకుంది. వచ్చే నెల రోజుల్లో ఈ కేసులో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV