
ఢిల్లీ, 12,మార్చి (హి.స.) జాతీయ విద్యా పరిశోధనా శిక్షణ మండలి(ఎన్సీఈఆర్టీ) ఎనిమిదో తరగతి సామాజిక శాస్త్ర పాఠ్య పుస్తకంలో న్యాయవ్యవస్థలో నెలకొన్న అవినీతి గురించి వివాదాస్పద పాఠాన్ని రచించిన ముగ్గురు నిపుణులపై సుప్రీంకోర్టు కఠిన చర్యలు తీసుకుంది. ఆ ముగ్గురినీ దూరంగా ఉంచాలని కేంద్రాన్ని, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. న్యాయవ్యవస్థలో అవినీతిపై రాసిన వివాదాస్పద పాఠాన్ని ప్రచురించినందుకు ఎన్సీఈఆర్టీ సుప్రీంకోర్టుకు బేషరతుగా క్షమాపణ కోరడంతో పాటు ఆ పుస్తకాన్ని ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. వివాదాస్పద పాఠాన్ని ప్రొఫెసర్ మైకేల్ డానియన్ నేతృత్వంలో సుపర్ణా దివాకర్, అలోక్ ప్రసన్న కుమార్లతో కూడిన బృందం రూపొందించిందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం దృష్టికి ఎన్సీఈఆర్టీ తీసుకెళ్లింది. ‘‘ప్రొఫెసర్ మైకేల్ డానియన్, ఆయన సహచరులు సుపర్ణా దివాకర్, అలోక్ ప్రసన్నకుమార్లకు భారత న్యాయ వ్యవస్థను గురించిన సరైన పరిజ్ఞానం లేకపోయి ఉండాలి లేదంటే వాళ్లు ఉద్దేశ పూర్వకంగా భారత న్యాయ వ్యవస్థకు కళంకం ఆపాదించేందుకు వాస్తవాలని వక్రీకరించైనా ఉండాలి’’ అని ధర్మాసనం పేర్కొంది. భావి తరాల పిల్లల కోసం పాఠ్య పుస్తకాలు తయారు చేసే ప్రక్రియతో ఈ ముగ్గురి ప్రమేయం ఉండటంలో అర్థం లేదని భావిస్తున్నామని స్పష్టం చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ