
ఢిల్లీ, 12,మార్చి (హి.స.) కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్కుమార్ను ఆ పదవి నుంచి తొలగించాలనే తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు విపక్షాలు రంగం సిద్ధం చేస్తున్నాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అభిశంసనకు అనుసరించాల్సిన ప్రక్రియే సీఈసీకీ వర్తిస్తుంది. అంటే లోక్సభలో నోటీసు ఇవ్వడానికి కనీసం 100 మంది సభ్యులు, రాజ్యసభలో ఇచ్చేందుకు 50 మంది సభ్యులు సంతకం చేయాలి. విపక్షాలు సుమారు 120 మంది లోక్సభ సభ్యుల నుంచి, 60 మంది రాజ్యసభ సభ్యుల నుంచి సంతకాలు సేకరించాయి. విపక్ష ఇండియా కూటమిలోని అన్ని పార్టీలకు చెందినవారితోపాటు కూటమిలో లేని ఆప్ ఎంపీలూ సంతకాలు చేశారు. గురువారం లేదా శుక్రవారం ఉభయ సభల్లోనూ వేర్వేరుగా వీటిని సమర్పించనున్నట్లు సీనియర్ ఎంపీ ఒకరు వెల్లడించారు. సీఈసీపై పార్లమెంటులో నోటీసు ఇవ్వడం ఇదే తొలిసారి. అనేక సందర్భాల్లో, ముఖ్యంగా ఓటర్ల జాబితా ‘ప్రత్యేక ముమ్మర సవరణ’ (సర్) కసరత్తులో అధికార భాజపాకి సీఈసీ కొమ్ముకాస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీంతోసహా ఏడు అభియోగాలను అవి మోపుతున్నాయి. విధినిర్వహణలో పక్షపాత ధోరణి, ఎన్నికల్లో అవకతవకలపై దర్యాప్తునకు ఉద్దేశపూర్వకంగా అడ్డుపడటం, పెద్దఎత్తున ఓట్లను తొలగించడం వంటివి దీనిలో ఉన్నాయని తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ