అమెరికాలో రిలయన్స్ భారీ పెట్టుబడులు
ముంబయి, 12, మార్చి (హి.స.) భారత కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అమెరికాలో భారీగా పెట్టుబడులు పెట్టబోతోంది. అక్కడ 50 ఏళ్లలో తొలిసారిగా నిర్మిస్తున్న కొత్త చమురు రిఫైనరీ నిర్మాణంలో ఆర్ఐఎల్ భాగస్వామి కానుంది. తమ దేశ చర
Mukesh Ambani


ముంబయి, 12, మార్చి (హి.స.) భారత కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అమెరికాలో భారీగా పెట్టుబడులు పెట్టబోతోంది. అక్కడ 50 ఏళ్లలో తొలిసారిగా నిర్మిస్తున్న కొత్త చమురు రిఫైనరీ నిర్మాణంలో ఆర్ఐఎల్ భాగస్వామి కానుంది. తమ దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద రిఫైనరీ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

కొత్త రిఫైనరీని టెక్సాస్ రాష్ట్రంలోని బ్రౌన్స్విల్ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారు. ఇది పూర్తిగా అమెరికా షేల్ గ్యాస్ ఆధారంగానే నడుస్తుందని ఈ ప్రాజెక్టును పర్యవేక్షించే అమెరికా ఫస్ట్ రిఫైనింగ్ (ఏఎఫ్ఆర్) పేర్కొంది. ఈ రిఫైనరీలో ఉత్పత్తి అయ్యే ఇంధనాలను కొనుగోలు చేయడానికి 20 ఏళ్ల ఒప్పందంపై రిలయన్స్ సంతకాలు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్-జులైలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగనుంది.

300 బిలియన్ డాలర్ల ఒప్పందం..

రిలయన్స్ భాగస్వామిగా ఉన్న ఈ ప్రాజెక్టు నిమిత్తం 300 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.27 లక్షల కోట్ల) ఒప్పందం జరిగిందని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో పేర్కొన్నారు. 10 అంకెల మార్కెట్ విలువ గల ఒక అంతర్జాతీయ దిగ్గజం నుంచి 9 అంకెల పెట్టుబడి వచ్చిందని కంపెనీ పేరును ఉదహరించకుండా ఏఎఫ్ఆర్ పేర్కొంది. ఈ పరిణామాలపై రిలయన్స్ స్పందించలేదు. లూసియానాలో 1977లో మారథాన్ ఏర్పాటు చేసిన రిఫైనరీ అనంతరం, అమెరికాలో ఏర్పాటవుతున్న తొలి ప్రధాన చమురు శుద్ధి ప్రాజెక్టు ఇదే. ఈ ప్రాజెక్టు ఆర్థిక వివరాలు కానీ, ప్రాజెక్టు ఎంతకాలంలో పూర్తవుతుందని కానీ ట్రంప్, ఏఎఫ్ఆర్ వెల్లడించలేదు.

అమెరికాలో రిలయన్స్కు ఇదే తొలి రిఫైనరీ: అమెరికాలో రిలయన్స్ నిర్మించనున్న తొలి రిఫైనరీ ఇదే కానుంది. కంపెనీకి మనదేశంలోని జామ్నగర్లో ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనింగ్ కాంప్లెక్స్ (రోజుకు 1.24 మి. బ్యారెళ్ల సామర్థ్యం) ఉంది. ఎనర్జీ ట్రేడింగ్, సాంకేతిక భాగస్వామ్యాలు, పెట్టుబడుల ద్వారా అమెరికాతో రిలయన్స్కు ఎప్పటి నుంచో వాణిజ్య బంధం ఉంది. అమెరికా షేల్ గ్యాస్ ఆస్తుల్లోనూ రిలయన్స్ పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం అమెరికాలో ఇంధనాన్ని సైతం విక్రయిస్తోంది. ముడి చమురు, పెట్రోకెమికల్ ఫీడ్స్టాక్స్, టెక్నాలజీని అమెరికా భాగస్వాముల నుంచి పొందుతోంది. ఫేస్బుక్, గూగుల్ సంస్థలు ముకేశ్ అంబానీకి చెందిన జియో ప్లాట్ఫామ్స్లో పెట్టుబడులు పెట్టాయి. జనరల్ అట్లాంటిక్ వంటి అమెరికా ఇన్వెస్టర్లు రిలయన్స్ రిటెయిల్ వెంచర్స్లో మైనారిటీ వాటా కలిగి ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande