
అమరావతి, 12 మార్చి (హి.స.)ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించి ప్రభుత్వం పలు ఉత్తర్వులు వెలువరించడం సహజం. ఉద్యోగుల ప్రవర్తనకు సంబంధించి ఏపీ సివిల్ సర్వీసెస్ ప్రవర్తన నియమావళి 1964 అమల్లోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ స్టేట్ సివిల్ సర్వీసెస్ ప్రవర్తన నియమావళి 1964ని అడాప్ట్ చేసుకొని అమలు పరుస్తున్నాం. ఈ నియమాలు ప్రభుత్వ ఉద్యోగులు ఏమి చేయాలి.. మరి ఏమి చేయకూడదు? అనే విషయాలను తెలియజేస్తాయి..
ప్రభుత్వ ఉద్యోగి అంటే తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసులో సభ్యుడుగా ఉన్న వ్యక్తి. లేదా రాష్ట్ర పరిధిలో ఏదైనా సివిల్ పోస్టులో ఉన్న వ్యక్తి అని అర్థం. అతను విధుల్లో ఉన్నా, సస్పెన్షన్లో ఉన్నా, సెలవులో ఉన్నా లేదా రాష్ట్రం లోపల లేదా వెలుపల ఇతర సేవలో ఉన్నా ఈ నియమాలు వర్తిస్తాయి. ఈ నియమాలు ప్రభుత్వ ఉద్యోగి కుటుంబ సభ్యులకు కూడా పరోక్షంగా వర్తిస్తాయి.
ఉద్యోగుల ప్రవర్తన నియమాలలో ఉద్యోగులకు కొన్ని పరిమితులు విధించారు.. రాజకీయాలు, ఎన్నికల్లో పాల్గొనడం, సంఘాల్లో చేరడం, సంఘాలను ఏర్పాటు చేయడం, ప్రదర్శనలు, సమ్మెలు, పత్రికలు, రేడియోలలో ప్రభుత్వంపై విమర్శలు, ఆస్తిని సంపాదించడం, విక్రయించడం, పరిష్కరించడం, వ్యక్తిగత హక్కులపై పరిమితులు, ప్రైవేటు వ్యాపారం, ఉద్యోగం, పెట్టుబడి పెట్టడం, అప్పు ఇవ్వడం, అప్పు తీసుకోవడం, చందాల సేకరణ, బహుమ తుల స్వీకరణ, బహిరంగ ప్రదర్శనలు, బాహ్య ప్రభావం కోసం ప్రయత్నించడం అంటే కాన్వాసింగ్, ఒకటి కంటే ఎక్కువ వివాహాలు చేసుకోవడం, మత్తు పానీయాల సేవనం.. ప్రభుత్వ ఉద్యోగి కొన్ని పనులను చేయకుండా నిరోధించే ఇటువంటి ఆంక్షల అంతిమ లక్ష్యం ప్రధానంగా ప్రభుత్వ సేవ ప్రమాణాలను మెరుగుపరచడం. ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగి మధ్య సంబంధం యజమాని, సేవకుని సంబంధం లాగా పరిగణించబడుతుంది. అందుకే ఒక ప్రభుత్వ ఉద్యోగి సహేతుకమైన మర్యాదపూర్వక ప్రవర్తన నియమాలను పాటించాలని, తన దుష్ప్రవర్తన ద్వారా తన సర్వీస్కు అపకీర్తి తీసుకురాకూడదని ఆశించబడుతుంది.
ప్రభుత్వ ఉద్యోగి తన భార్య, అలాగే పిల్లల పట్ల చూపే నిర్లక్ష్యం తగని రీతిలో ఉంటే అతనిపై చర్య తీసుకోవడానికి తగిన కారణం కూడా కావచ్చు.. ఉద్యోగి తన విధి నిర్వ హణలో మాత్రమే కాకుండా తన వ్యక్తిగత జీవితంలో కూడా ఒక నిర్దిష్ట ప్రవర్తన నియమాలను పాటించాలని ప్రభుత్వం కోరుకుంటుంది. ప్రభుత్వ అధికారికి ఇష్టపూర్వకంగా ఇచ్చినా సరే.. అక్రమ పారితోషాకాల ద్వారా సంపదను పోగు చేసే స్వేచ్ఛ లేదు.. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఎటువంటి పని చేయకూడదు. తన అధికార హోదాకు ఎలాంటి ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించకూడదు. అలాగే తన అధికారిక విధుల నిర్వహణలో అత్యుత్తమ నిర్ణయాధికారాన్ని ఉపయోగించాలి. కానీ తన పై అధికారి నిర్దేశాల ప్రకారం అనుసరిస్తున్నప్పుడు మాత్రం ఇది వర్తించదు. ఉద్యోగి నిజాయితీ, చిత్తశుద్ధి లేదా పవిత్రత కలిగి ఉండాలి. అలాగే కర్తవ్యం, నిష్ట అంటే విశ్వాసపాత్రమైన సేవను కలిగి ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగికి తగని ప్రవర్తన అంటే మర్యాద లేని వైఖరి, అవిధేయత, హుందాతనం లేకపోవడం, బద్ధకం, అవినీతి అలవాట్లు, బాధ్యత నుండి తప్పించుకోవడం.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV