
న్యూఢిల్లీ, 13 మార్చి (హి.స.)
అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల వల్ల హర్మూజ్ జలసంధి గుండా ఇంధన రవాణాకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. జలసంధి వద్ద నిలిచిపోయిన ఎనిమిది గ్యాస్ ట్యాంకర్లను సురక్షితంగా భారత్కు రప్పించేలా ఇరాన్తో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల శాఖ ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం ఎనిమిది గ్యాస్ ట్యాంకర్లు హర్మూజ్ జలసంధికి సమీపంలో నిలిచిపోయి, ముందుకు వెళ్లేందుకు 'గ్రీన్ సిగ్నల్' కోసం వేచి చూస్తున్నాయి. అయితే, అదృష్టవశాత్తూ ఇప్పటికే రెండు చమురు నౌకలు జలసంధిని దాటి భారత్ వైపు ప్రయాణాన్ని ప్రారంభించాయి. మిగిలిన ఎల్పీజీ నౌకలను కూడా త్వరితగతిన రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్బీతో పలుమార్లు ఫోన్ ద్వారా చర్చలు జరిపినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నౌకల సురక్షిత ప్రయాణానికి ఇరాన్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇదే సమయంలో, భారత్లో సుమారు 250 మంది ఇరాన్ నావికులు చిక్కుకుపోయి ఉన్నారు. వారిని స్వదేశానికి పంపేందుకు భారత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. వారికి అవసరమైన వసతి, రక్షణను కూడా కల్పిస్తోంది.తమ నావికుల విషయంలో భారత్ చూపుతున్న చొరవ పట్ల ఇరాన్ సంతృప్తి వ్యక్తం చేస్తూ, గ్యాస్ ట్యాంకర్ల తరలింపునకు సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం అందుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..