
ఢిల్లీ, 14మార్చి (హి.స.) కృత్రిమ మేధ రాకతో టెక్ రంగంలోని ఉద్యోగులకు ఈ ఏడాదీ కష్టకాలమే కొనసాగుతోంది. ఏఐతో ఉద్యోగాలు పోతాయనే ఆందోళనలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే దిగ్గజ కంపెనీల ప్రకటనలు కలవరపెడుతున్నాయి. తాజాగా ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా భారీ ఎత్తున లేఆఫ్లకు (Meta layoffs) సిద్ధమైనట్లు తెలుస్తోంది. దాదాపు 16వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఏఐ లో పెట్టుబడులను పెంచుతోన్న నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్యలో కోత పెట్టాలని మెటా (Meta) భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్స్.. సీనియర్ లీడర్లతో పంచుకున్నట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. సంస్థ సిబ్బందిలోని దాదాపు 20 శాతం మందిని తొలగించాలని మెటా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీలో 79వేల మంది పనిచేస్తున్నారు. అంటే.. దాదాపు 16వేల మందికి లేఆఫ్లు (Layoffs) ఇవ్వనున్నట్లు సమాచారం.
ఇదే నిజమైతే, 2022-2023 తర్వాత కంపెనీ చేపట్టబోయే అతిపెద్ద తొలగింపులు ఇవే కానున్నాయి. 2022 చివర్లో 11 వేల మందికి లేఆఫ్లు ఇచ్చిన మెటా.. ఆ మరుసటి ఏడాదే 10వేల మందిని విధుల్లో నుంచి తీసేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజా కథనాలపై మెటా నుంచి అధికారిక స్పందనేదీ రాలేదు. ఇక, మెటా ప్రస్తుతం ఏఐ రంగంలో విస్తృతంగా పెట్టుబడులు పెడుతోంది. ఇందులో భాగంగానే 2028 నాటికి డేటా సెంటర్ల ఏర్పాటు కోసం 600 బిలియన్ డాలర్లు వెచ్చించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కంపెనీ ఇటీవల వెల్లడించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ