
కర్నూలు, 15 మార్చి (హి.స.)భానుడు భగభగలాడుతున్నాడు. ఎండలు ముదురుతున్న కొద్దీ మన శరీరం డీహైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం పెరుగుతోంది. ముఖ్యంగా ఆరుబయట పనిచేసేవారు, ఏసీ గదుల్లో ఉండేవారు కూడా తమ హైడ్రేషన్ లెవల్స్ను కాపాడుకోవడం అత్యవసరం. అయితే దాహం తీర్చుకోవడానికి కూల్ డ్రింక్స్ వైపు కాకుండా మన సాంప్రదాయ పానీయాలైన కొబ్బరి నీళ్లు, మజ్జిగ వైపు మొగ్గు చూపాలని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ రెండింటిలో ఏది ఎప్పుడు తాగితే ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏవియేషన్, స్పేస్ అండ్ ఎన్విరాన్మెంటల్ జర్నల్ ప్రకారం.. మనం ఎంత ఎక్కువ సేపు ఎండలో గడుపుతామో, దానికి దామాషా ప్రకారం హైడ్రేటింగ్ డ్రింక్స్ తీసుకోవాలి. రోజుకు కనీసం మూడుసార్లు ఇలాంటి పానీయాలు తీసుకోవడం వల్ల వేడిని సమర్థవంతంగా అధిగమించవచ్చని నిరూపితమైంది.
కొబ్బరి నీళ్లలో పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మీరు ఎండలో తిరిగి అలసిపోయి వచ్చినప్పుడు లేదా వ్యాయామం చేసిన తర్వాత కొబ్బరి నీళ్లు తాగడం ఉత్తమం. ఇది శరీరానికి వెంటనే ఎలక్ట్రోలైట్లను అందించి, నీరసాన్ని తగ్గిస్తుంది. ప్యాక్ చేసిన డ్రింక్స్ కాకుండా, పచ్చి కొబ్బరి నుండి తీసిన తాజా నీటిని తాగితేనే పూర్తి లాభం ఉంటుంది.
మజ్జిగ: మజ్జిగ మన సంప్రదాయ పానీయం. ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్ కడుపుని చల్లబరుస్తుంది. భోజనం చేసిన తర్వాత మజ్జిగ తాగడం చాలా మంచిది. ఇది తిన్న ఆహారం త్వరగా అరిగేలా చేస్తుంది. కడుపులో మంట, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.
మజ్జిక తాగేటప్పుడు దానిలో కొన్ని యాడ్ చేసుకుంటే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి. మజ్జిగలో కొంచెం జీలకర్ర పొడి, నల్ల ఉప్పు కలుపుకుంటే రుచితో పాటు ఆరోగ్యమూ పెరుగుతుంది. చక్కెర కలిపిన లస్సీ కంటే పల్చటి మజ్జిగే వేసవికి బెస్ట్.
నిపుణులు ఏమంటున్నారు: కేవలం ఏదో ఒకటి మాత్రమే తాగడం కంటే.. ఉదయం పూట కొబ్బరి నీళ్లు, మధ్యాహ్నం భోజనం తర్వాత మజ్జిగ తాగడం వల్ల శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి. కృత్రిమ రంగులు, చక్కెర ఉండే సాఫ్ట్ డ్రింక్స్కు దూరంగా ఉండి.. ఈ ప్రకృతి సిద్ధమైన పానీయాలను అలవాటు చేసుకుంటే ఈ వేసవిని హాయిగా దాటవచ్చు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV