
మోగా: 15,మార్చి (హి.స.) పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. భగవంత్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ఆ పార్టీ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్కు ఏటీఎంలా మారిందని ఆయన ఆరోపించారు. మోగా జిల్లాలోని కిల్లీ చాహ్లాన్ గ్రామంలో శనివారం నిర్వహించిన ‘బద్లావ్(మార్పు)’ ర్యాలీలో పాల్గొన్న అనంతరం అమిత్ షా మాట్లాడారు. ‘‘అప్పులు, మాదకద్రవ్యాలు, మతమార్పిడిలు, అవినీతి, గ్యాంగ్స్టర్ల అరాచకాలతో పంజాబ్ నాశనమైంది. కాంగ్రెస్, అకాలీలు, ఆప్లకు పంజాబ్ చాలా అవకాశాలు ఇచ్చింది. రాష్ట్రంలో మార్పు తీసుకొచ్చేందుకు ఇప్పుడు భాజపాకు అవకాశమివ్వాల్సిన సమయం వచ్చింది. మాదకద్రవ్యాల నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించగలిగే ఏకైక శక్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. మా ప్రభుత్వ హయాంలోనే ఆర్టికల్ 370 రద్దయింది. ఉగ్రవాదం చివరి దశకు చేరుకుంది. నక్సలిజం అంతరించి పోయే స్థితిలో ఉంది. 2027లో భాజపా అధికారంలోకి వస్తే రెండేళ్లలోనే రాష్ట్రంలో మాదకద్రవ్యాల వ్యాపారం పూర్తిగా కనుమరుగవుతుంది’’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు. మోగా నుంచే భాజపా తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిందని ఆయన పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తిచేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ