
కోల్కతా/ఢిల్లీ, 18,మార్చి (హి.స.): పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత మమతా బెనర్జీ.. 74 మంది ఎమ్మెల్యేలకు షాకిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో వారికి టికెట్లు నిరాకరించారు. మంగళవారం 291 మందితో ప్రకటించిన జంబో జాబితాలో వారికి చోటు లభించలేదు. భవానీపుర్లో అసెంబ్లీ ప్రతిపక్ష నేత (భాజపా) సువేందు అధికారితో మమతా బెనర్జీ తలపడనున్నారు. కాళీఘాట్లోని తన నివాసంలో ఆమె అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవడానికి, పాత కొత్తల కలయికకు, సంస్థాపరమైన సమతుల్యతకు, భాజపా దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి మమత ప్రాధాన్యమిచ్చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మొత్తం 294 స్థానాల్లో 291 చోట్ల తాము పోటీ చేస్తున్నామని, మిగిలిన 3 సీట్లను డార్జీలింగ్ హిల్స్లోని భారతీయ గూర్ఖా ప్రజాతాంత్రిక్ మోర్చాకు కేటాయించామని తెలిపారు.
పార్టీకున్న 224 మంది ఎమ్మెల్యేల్లో 135 మందికి మళ్లీ టికెట్లు దక్కాయి. 15 మంది సీట్లు మారాయి.
2021 ఎన్నికల్లో నందిగ్రామ్లో తనను ఓడించిన సువేందు అధికారిపైనే మమత మళ్లీ పోటీకి దిగారు. అయితే ఈసారి వారిద్దరూ భవానీపుర్లో తలపడుతున్నారు. నందిగ్రామ్లో పవిత్ర కర్కు టికెట్టు ఇచ్చారు. అక్కడ సువేందు అధికారే పోటీ చేస్తున్నారు.
టికెట్లు దక్కిన వారిలో యువ నేతలు, వృత్తి నిపుణులు, ప్రముఖులు ఉన్నారు. అయితే ఈసారి సెలబ్రిటీల కంటే బలమైన అభ్యర్థులకే పార్టీ ప్రాధాన్యమిచ్చింది.
రాజ్గంజ్ నుంచి ఒలింపియన్, ఆసియా క్రీడల బంగారు పతక విజేత స్వప్న బర్మన్, తుఫాన్గంజ్ నుంచి మాజీ క్రికెటర్ శివ్ శంకర్ పాల్ బరిలో నిలిచారు.
291 మంది అభ్యర్థుల్లో 239 మంది పురుషులు (82శాతం), 52 మంది మహిళలు (18శాతం).
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ