
అమరావతి, 18 మార్చి (హి.స.): పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో గ్యాస్ కొరత భయాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో హరియాణా గురుగ్రామ్లో ఉన్న ఎల్పీజీ గ్యాస్ ఏటీఎం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గతేడాది పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ఏఐ ఆధారిత గ్యాస్ సిలిండర్ స్మార్ట్ వెండింగ్ మిషన్ను ఏర్పాటు చేసింది. ఏటీఎం మాదిరిగా ఇది పని చేస్తుంది. దీంతో సిలిండర్ల కోసం ఎక్కువ రోజులు ఎదురు చూడడం, గంటలపాటు క్యూలో నిల్చోవడం ఉండదు. కేవలం 2-3 నిమిషాల్లోనే సిలిండర్ తీసుకోవచ్చు.
సాధారణంగా నివాసాల్లో ఉపయోగించే లోహంతో చేసిన సిలిండర్లతో పోలిస్తే ఈ ఏటీఎంలలో లభ్యమయ్యే సిలిండర్లు తేలికగా ఉంటాయి. సాధారణ సిలిండర్లు అందులోని గ్యాస్తో కలిపి మొత్తం 31కిలోల బరువు ఉంటాయి. అయితే ఫైబర్తో తయారు చేసిన ఈ సిలిండర్లు గ్యాస్తో కలిపి కేవలం 15కిలోల బరువు మాత్రమే ఉంటాయి. వీటిని తీసుకువెళ్లడం కూడా సులువు. భారత్గ్యాస్ కాంపోజిట్ సిలిండర్ కనెక్షన్ ఉన్న వినియోగదారులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ