
బెంగళూరు, 19 మార్చి (హి.స.)చాలామంది విస్మరించే ముల్లంగి, అనేక అద్భుత ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ఒక అద్భుతమైన ఆహార ఔషధం. ఇది మలబద్ధకం, పైల్స్, క్యాన్సర్ నివారణ, అధిక రక్తపోటు, షుగర్ నియంత్రణ, బరువు తగ్గడం, మూత్రపిండాల ఆరోగ్యం మరియు జీర్ణ సమస్యల ఉపశమనానికి సహాయపడుతుంది. పోషకాలు, ఫైబర్ సమృద్ధిగా ఉన్న ముల్లంగిని మీ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిదని బెంగళూరుకి చెందిన ఆరోగ్య నిపుణులు శివప్ప ఎన్ చెబుతున్నారు.
సాధారణంగా కొన్ని దుంపకూరల పట్ల మనలో భయాలు ఉంటాయి.. ముఖ్యంగా వాతం చేస్తుందనే అపోహ ఉంటుంది. అయితే ముల్లంగి దీనికి ఒక అరుదైన మినహాయింపు. ఇది ఒకటి కాదు, రెండు కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే అద్భుతమైన కూరగాయ. ఆహారపరంగా ఇతర దుంపకూరల వలె ముల్లంగి ప్రాచుర్యం పొందకపోయినప్పటికీ, దాని ఔషధ గుణాలు అపారమైనవి. అందుకే.. ముల్లంగి ఆరోగ్యపరంగా అద్భుతమైనదని పేర్కొంటున్నారు నిపుణులు.. ముల్లంగి ప్రధాన విశిష్టత దాని పోషక విలువలు. ఇది ఆరోగ్యకరమైన ఆహార ఔషధంగా పనిచేస్తుంది.. ఎందుకంటే ఇందులో న్యూట్రియంట్స్, ఫైటోకెమికల్స్ సమృద్ధిగా ఉంటాయి. ప్రధానంగా పొటాషియం ఉండటం వల్ల ఇది డయూరిటిక్గా పనిచేసి రక్తపోటును తగ్గిస్తుంది. విటమిన్ బి6 రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది.. అలాగే పిండిపదార్థాలు శక్తిని అందిస్తాయి. ఇవన్నీ కలిసి ముల్లంగిని ఒక మల్టీవిటమిన్ క్యాప్సూల్ వలె మార్చుతాయి.
ముల్లంగి దూరం చేసే ప్రధాన ఆరోగ్య సమస్యలు:
మలబద్ధకం: ముల్లంగిలో అధిక మొత్తంలో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది. ఇది పేగులకు బలాన్నిచ్చి, వాటి ఆరోగ్యాన్ని కాపాడుతూ, సురక్షితంగా మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది. ఉడికించిన ముల్లంగిని ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు లేదా సూప్లలోనూ వాడుకోవచ్చు.
పైల్స్ నుంచి ఉపశమనం: పైల్స్తో బాధపడేవారికి ముల్లంగి ఒక మంచి ఔషధం. దీనిలోని ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. పేగులను ఉత్తేజపరిచి సజావుగా మలవిసర్జన జరిగేలా చేస్తుంది. అలాగే, ఇది శరీరంలో వాపును తగ్గించడం ద్వారా పైల్స్ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 10 నుండి 20 మిల్లీలీటర్ల ముల్లంగి రసం తీసుకోవడం ప్రయోజనకరం.
క్యాన్సర్ నివారణ: ముల్లంగి క్యాన్సర్ నివారణకు కూడా సహాయపడుతుంది. అధ్యయనాల ప్రకారం, ముల్లంగిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల క్యాన్సర్ కణితుల పెరుగుదలను నిరోధించవచ్చు. ఇది క్యాన్సర్ ప్రమాదం నుంచి రక్షించడంలో తోడ్పడుతుంది.
అధిక రక్తపోటు నియంత్రణ: ముల్లంగి అధిక రక్తపోటు (హై బీపీ) నియంత్రణకు చాలా ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే, విటమిన్ కె డయూరిటిక్గా పనిచేసి, శరీరంలోని అదనపు ద్రవాలను బయటకు పంపించి బీపీని అదుపులో ఉంచుతుంది.
షుగర్ నియంత్రణ: సాధారణంగా దుంపకూరలలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ ఉంటాయనే అపోహ ఉన్నప్పటికీ, ముల్లంగిలో తక్కువ కార్బోహైడ్రేట్లు, అధిక ఫైబర్ ఉంటాయి. ఈ ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇది నీటిని పీల్చుకొని కడుపు నిండిన భావనను కలిగిస్తుంది, తద్వారా అధిక ఆహారం తీసుకోవడాన్ని నివారిస్తుంది.
బరువును తగ్గిస్తుంది: అధిక బరువు ఉన్నవారికి ముల్లంగి చాలా సహాయపడుతుంది. దీనిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది.. తక్కువ కేలరీలు ఉండటం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
మూత్రపిండాల ఆరోగ్యం: ముల్లంగి మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడుతుంది. దీనిలోని పొటాషియం డయూరిటిక్గా పనిచేసి శరీరంలోని మలినాలను బయటకు పంపించి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే, ఇప్పటికే కిడ్నీ వ్యాధులు ఉన్నవారు మాత్రం దీనిని వైద్య సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే అధిక పొటాషియం వారికి ఇబ్బంది కలిగించవచ్చు.
జీర్ణ సమస్యలు: గ్యాస్, ఉబ్బరం, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ (IBS) వంటి అనేక జీర్ణ సమస్యలను తగ్గించడంలో ముల్లంగి ఉపయోగపడుతుంది. దీనిలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
ముల్లంగిని మీ ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా ఈ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇది కేవలం ఒక కూరగాయ కాదు, మీ సంపూర్ణ ఆరోగ్యానికి దివ్యౌషధంగా పనిచేస్తుందని పేర్కొంటున్నారు ఆయుర్వేద నిపుణులు.. అయితే, ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది..
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV